మంచిర్యాలటౌన్/హాజీపూర్/మందమర్రి/జైపూర్/చెన్నూర్ రూరల్/బెజ్జూర్/ ఆసిఫాబాద్ టౌన్, సెప్టెంబర్ 25 : అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలను ముంచెత్తుతున్నది. బుధవారం రాత్రి నుంచి వర్షం పడుతుండగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతుండగా, గేట్లు ఎత్తి దిగువకు వదులుతుండడంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీట మునిగాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు చిత్తడిగా మారాయి. జిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయం వరకు 26.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 40 గేట్లు ఎత్తి 640340 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతుండగా, సమీపంలోని గౌతమేశ్వర ఆలయం ముందు వరకు నీటిప్రవాహం వచ్చింది. పుష్కరఘాట్లు మునిగిపోయాయి. మరోవైపు మంచిర్యాల పట్టణ సమీపంలోని రాళ్లవాగు నిండుగా ప్రవహిస్తోంది.
గోదావరినదిలో రాళ్లవాగు కలిసే చోట నీరు వెనక్కి తన్నుతున్నది. రాళ్లవాగు ప్రవాహం ఇంకా పెరిగితే సమీపంలోని కాలనీల్లోకి నీరు వచ్చిచేరే అవకాశమున్నది. చెన్నూర్‌లో మహంకాళి వాడకు చెందిన మధు ఇంటి గోడ కూలిపోయింది. మందమర్రి మండల పరిధిలోని బొక్కలగుట్ట గ్రామ శివారు గాంధారిఖిల్లా సమీపంలోగల గండి పడిన మేడి చెరువును కలెక్టర్ కుమార్ దీపక్, తహశీల్దార్ సతీశ్‌కుమార్, ఇరిగేషన్ డీఈ శారద, సిబ్బందితో కలసి పరిశీలించారు. వరద పరిస్థితులపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. జైపూర్ మండలంలో గోదావరి నిండుగా ప్రవహిస్తున్నది. సుందిళ్ల ప్రాజెక్టు 74 గేట్లు ఎత్తడంతో వరద దిగువకు వెళ్తున్నది. గోదావరి సమీప గ్రామాలైన వేలాల, కిష్టాపూర్, పౌనూర్, శివ్వారం గ్రామాల్లో పత్తి, వరి పంటలు నీట మునిగాయి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లను తెరవడంతో అన్నారం బరాజ్‌లోకి భారీగా వరద వస్తున్నది.
సీఐ దేవేందర్ రావు అన్నారం బరాజ్‌ను సందర్శించారు. అన్నారం బరాజ్, గోదావరి వైపు వెళ్లవద్దని ప్రజలకు సూచించారు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏడీఏ బానోత్ ప్రసాద్ తెలిపారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 34 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జూబ్లీ మారెట్ వద్ద డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక వర్షపు నీరు రోడ్లపై నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జన్కాపూర్ సబ్ జైలు వెనకాల ఉన్న తిరుపతికి చెందిన ఇల్లు కూలింది. బెజ్జూర్-సోమిని రూట్లో సుస్మీర్, కుశ్నపల్లి వాగులు ఉప్పొంగాయి. వంతెనలు లేకపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సుస్మీర్, సోమిని, మొగవెళ్లి, ఇప్పలగూడ, నాగపల్లి తదితర గిరిజన గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. బెజ్జూర్-గూడెం సోమిని మీదుగా వెళ్లాల్సిన రోడ్డు కోతకు గురైంది.
హాజీపూర్, సెప్టెంబర్ 25 : ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతున్నది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, 15.9331 టీఎంసీల నీరు ఉన్నది. శ్రీరాంసాగర్ నుంచి 341000 క్యూ సెక్కులు, కడెం ప్రాజెక్టు నుంచి 4144 క్యూ సెక్కులు, వర్షంతో 258232 క్యూ సెక్కులు నీరు వచ్చి చేరుతున్నది. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 288 క్యూ సెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూ సెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. 40 గేట్లు ఎత్తి 638035 క్యూ సెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇక కుమ్రం భీం ప్రాజెక్టు 5వ గేటు 0.3 మీటర్లు ఎత్తి 550 క్యూసెకుల నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 680 క్యూసెక్కులు ఉంది.
మంచిర్యాల టౌన్ : నిండుగా ప్రవహిస్తున్న రాళ్లవాగు
ఆసిఫాబాద్ టౌన్ : అడ ప్రాజెక్ట్ గేట్ల నుంచి దిగువకు వెళ్తున్న నీరు
ఆసిఫాబాద్ టౌన్ : జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లో కూలిన ఇల్లు
మంచిర్యాల టౌన్ : ముసురులో వెళ్తున్న వాహనాలు
జైపూర్ : వేలాలో పత్తి చేనులోకి చేరిన వరద
హాజీపూర్ : ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి దిగువకు వెళ్తున్న నీరు