ఆదిలాబాద్, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో శనివారం కురిసిన వర్షం భారీ నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన పంటలను వరద నీరు ముంచెత్తింది. వాగులు ఉప్పొంగడంతో రహదారులు తెగిపోయి వంతెనలు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల రాకపోకలకు నిలిచాయి. ఇండ్లు కూలాయి. చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ లైన్లపై పడడంతో కరెంటు సరఫరాలో అంతరాయం కలిగింది. పత్తి, సోయా, కంది పంటలకు వాతావరణం సహకరించడంతో బాగా పెరుగుతున్నాయి.
సోయా కాత దశకు చేరుకోగా.. పత్తి కూడా బాగా ఉంది. వర్షం కారణంగా పొలాల్లో వరద నీరు ప్రవహించడంతో పంటలు నేలకొరిగాయి. వ్యవసా య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట న ష్టం వివరాలను సేకరిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతా ల్లో అధికారులు సహాయక చర్యలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో మాట్లాడుతున్నారు.
వ్యాధు లు ప్రబలకుండా వై ద్య శిబిరాలు ఏర్పా టు చేశారు. బాధితులకు తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేసి భోజనం అందిస్తున్నారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించి నేలకొరిగిన పంటలను పరిశీలించారు. ప్రభుత్వం ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా నియోజకవర్గంలో పర్యటించారు. ఆదిలాబాద్ జిల్లాలో 18,19 తేదీల్లో భారీ వర్షాల ఉందనే వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. నేడు జరిగే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. సమస్యలు ఉంటే కంట్రోల్ రూం నంబరు 18004251939కు ఫోన్ చేయాలని సూచించారు.
ఇంద్రవెల్లి, ఆగస్టు 17 : మండలంలోని పత్తి పంటతోపాటు సోయా, మొక్కజొన్న, కంది తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద ప్రవాహానికి ఇసుకతోపాటు మట్టి పొలాల్లో పేరుకుపోయింది. రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బోర్రన్న రైతులతో కలిసి పొలాలను పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష ్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఇచ్చోడ(సిరికొండ), ఆగస్టు 17 : సిరికొండ మండలంలోని కొండాపూర్ గ్రామ శివారులో చిక్మాన్ వాగుపైన ఉన్న వంతెన అప్రోచ్ రోడ్డు పూర్తిగా కొట్టుకు పోయింది. వంతెనను పంచాయతీ రాజ్ ఈఈ శివరాం, డీఈ రాజేశ్వర్, డీఎల్పీవో ఫణిందర్, ఎంపీడీవో రవీందర్, ఎంపీవో సంతోష్ పరిశీలించారు.
సోన్, ఆగస్టు 17 : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుల్లో పెద్ద మొత్తంలో వరదనీరు చేరుతుందని, గేట్ల నుంచి వరద నీరు కిందికి వదలడంతో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. ఆదివారం స్వర్ణ నది గేట్లు ఎత్తడంతో సోన్ మండలంలోని జాఫ్రాపూర్ వద్ద గల వంతెనపై నుంచి వరదనీరు ఉధృతంగా పారుతున్నది. అటువైపు ఎవరూ వెళ్లకుండా చూడాలని ఎస్పీ సూచించారు. ఆమె వెంట ఏఎస్పీ రాజేశ్మీన, ఎస్సై కే.గోపీ ఉన్నారు.
బేల, ఆగస్టు 17 : సాత్నాల ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో పెన్‌గంగా ఉధృతి పెరిగి, బ్యాక్ వాటర్‌తో మణియార్‌పూర్, గూడ, బేధోడ, కంఘార్ పూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. పెన్‌గంగా వాటర్ వల్ల దాదాపు వందల ఎకరాల్లో పంటలు నష్టపోయారు. మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్లకూడదని అధికారులు సూచించారు.
ఎదులాపురం, ఆగస్టు 17 : ఆదిలాబాద్ పట్టణంలోని హ్యాండిక్యాప్, జీఎస్ ఎస్టేట్ కాలనీలను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్లు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాలు మరో మూడు రోజులు కొనసాగే అవకాశాలున్నయని వాతావరణ శాఖ సూచించిందని తెలిపారు. లో లెవల్ వంతెల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి చిన్న వాగు వద్ద ఇద్దరు పోలీసులను నియమించామన్నారు.
నార్నూర్, ఆగస్టు 17 : గాదిగూడ మండలంలోని ఝరి పీహెచ్సీ సిబ్బంది శ్రీదేవి, రత్నబాయి, సులోచన, కల్పన, మోహన్, లక్ష్మణ్‌లు వాగు దాటి వైద్యం అందించారు. ఈ సందర్భంగా హెల్త్ ఎడ్యుకేటర్ రాథోడ్ రవీందర్ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తామన్నారు.
జైనథ్, ఆగస్టు 17 : మండల సరిహద్దులోని పెన్‌గంగా ఉగ్రరూపంగా ప్రవహిస్తున్నది. సాత్నాల ఉధృతంగా ప్రవహించడంతో తర్నం లో లెవల్ బ్రిడ్జి మునిగింది. జైనథ్, బేల మండలంలో పత్తి, సోయా, కంది పంటలు నీట మునిగి.. దాదాపు 10 వేల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. మహారాజ్‌ల సమాధులు కూడా నీటమునిగాయి.
భీంపూర్, ఆగస్టు 17 : భీంపూర్ మండలంలో పెన్‌గంగా, వాగుల పరీవాహక చేలు వందల ఎకరాల్లో నీట మునిగాయి. పత్తి, కంది చేలలో ఇసుక మేటలు వేశాయి. తహసీల్దార్ నలందప్రియ, ఎంపీడీవో గోపాలకృష్ణారెడ్డి, ఏవో శ్రీనివాస్‌రెడ్డి నష్టం అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు.
భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. అధికారులతో సర్వేలు చేయించి పంట నష్టం జరిగిన రైతులను గుర్తించాలి. ప్రధానంగా పత్తి, సోయా, మొక్కజొన్న పంటలు నెలకొరిగి రైతులకు తీవ్రనష్టం జరిగింది. వీరిని ప్రధానంగా ఆదుకోవాలి.
– తోడసం హరిదాస్, రైతు, హీరాపూర్.
బజార్హత్నూర్ మండలంలో వర్షంతో దెబ్బతిన్న పంటలను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. రైతులకు మనో ధైర్యాన్ని కల్పించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన ప్రతి గుంట భూమిని రికార్డు చేసి నివేదిక అందజేయాలని వ్యవసాయధికారులకు ఆదేశించారు.
– బజార్హత్నూర్, ఆగస్టు 17