నిర్మల్ అర్బన్, ఆగస్టు 28: నిర్మల్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. స్వర్ణ, సాత్నాల, గడ్డెన్నవాగు, కడెం ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేయడంతో వాగులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంటలు నీట మునిగి నష్టం వాటిల్లింది నిర్మల్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల పరిశీలించారు. శాంతినగర్ చౌరస్తా, సోఫీనగర్, తిరుమల థియేటర్ పరిసరాల ప్రజలతో మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే కలెక్టర్ కంట్రోల్ రూం 9100577132 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ జీఎన్ఆర్ కాలనీని పర్యవేక్షించారు. ఎస్పీ జానకీ షర్మిల బంగల్పేట్ చెరువు లోతట్టు ప్రాంతాన్ని సందర్శించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నిర్మల్‌లోని మంచిర్యాల చౌరస్తా, శాంతినగర్ క్రాస్ రోడ్, డాక్టర్స్ లైన్ ప్రాంతాల్లో రహదారులు నీట మునిగాయి. సోఫీనగర్, తారకరాం కాలనీల్లోని ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సోన్, ఆగస్టు 28: స్వర్ణ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో వరద నీరు జాఫ్రాపూర్, మాదాపూర్ వంతెనలపై నుంచి ప్రవహించింది. జాఫ్రాపూర్ వైకుంఠధామంతో పాటు మాదాపూర్ హనుమాన్ విగ్రహం వరకు నీరు రావడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంటలు మునిగిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి.
సారంగాపూర్, ఆగస్టు 28: స్వర్ణ ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరడంతో రెండు గేట్లను అధికారులు ఎత్తివేశారు. ప్రాజెక్టు కెపాసిటీ 1.037 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.895 టీఎంసీల నీరు ఉంది. మండలంలో వంజర్, జామ్, మల్లక్చించోలి, వైకుంఠపూర్, కంకెట, సాయినగర్ గ్రామాల్లో వరి, పత్తి పంటలకు నష్టం జరిగింది. చించోలి(బీ), జామ్-సారంగాపూర్, కంకెట-వైకుంఠపూర్ గ్రామాల రోడ్లు కోతకు గురై రాకపోకలు ఆగిపోయాయి, చించోలి(బీ) కల్వర్టు, గండిరామన్న పార్క్ వద్ద రోడ్డుపై చెట్టు, పెద్దపెద్ద రాళ్లు పడిపోవడంతో రూరల్ సీఐ కృష్ణ, ఎస్ఐ శ్రీకాంత్ దగ్గర ఉండి వాటిని తొలగించారు. సాయినగర్ గ్రామ సమీపంలో ఉన్న కల్వర్టు పొంగిపొర్లడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయియి.
లక్ష్మణచాంద, ఆగస్టు 28: లక్ష్మణచాంద మండలంలోని చామన్‌పల్లి, రాచాపూర్, మల్లాపూర్, వడ్యాల్, వడ్యాల్తండా గ్రామాల్లో పలు ఇండ్లు కూలిపోయాయి. పీచర సమీపంలోని చెలిమవాగు, తిర్పెల్లి వాగులో వంతెనలు దెబ్బతిన్నది. లక్ష్మణచాందలోని కేజీబీవీలో గోడ కూలిపోయింది. పంట పొలాలు నీట మునిగిపోయాయి. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
దిలావర్పూర్, ఆగస్టు 28 : దిలావర్పూర్మండలం న్యూలోలం గ్రామ పరిసర ప్రాంతంలో ఓర్రెలు తెగిపోవడంతో వరి, పత్తి, సోయా పంటలు నీట మునిగాయి. పంట చేనుల్లో ఇసుక మేటలు వచ్చాయి.
బాసర, ఆగస్టు 28 : బాసర నుంచి ఓని రహాదారిపై వరదతో రాకపోకలు నిలిచిపోయాయి. బిద్రెల్లి వాగు పొంగి ప్రవహించడంతో భైంసా – బాసర రోడ్డు దిగ్భంధమైంది. తహసీల్దార్, ఎంపీడీవో, పోలీసు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. తాత్కాలికంగా ట్రాఫిక్ నిలిపివేశారు. గోదావరిలో నీటి మట్టడం పెరగడంతో స్నానాలు నిలిపివేశారు.
ముథోల్, ఆగస్టు, 28 : ముథోల్ మండలం వడ్తాల్ వాగుపై నుంచి నీరు పారడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిపోయాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎంజీబీ పాఠశాలలో నీరు చేరడంతో విద్యార్థులకు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. స్థానిక సొసైటీలో వర్షపు నీరు చేరింది. పంటలు నీట మునగడంతో సర్వే చేసి నష్టపరిహారం అందించే విధంగా చర్య లు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. తహసీల్దార్ శ్రీలత వడ్తాల్ వాగును పరిశీలించి జాగ్రత్తలు సూచించారు. బోరిగాంలో కూలిన ఇండ్లను తహసీల్దార్ పరిశీలించారు. ప్రభుత్వం పరంగా వచ్చే ఆర్థిక సాయాన్ని అందజేస్తామని తెలిపారు.
కుంటాల, ఆగస్టు, 28 : మండలంలోని గ్రామాల్లో పత్తి, సోయా పంటలు నీట మునిగి నష్టం జరిగింది. కుంటాల నుంచి అంబకంటి, కల్లూరు నుంచి అందకూర్ మధ్య గల రోడ్లు కోతకు గురయ్యాయి. కుంటాలలో పోశెట్టి అనే వ్యాపారికి చెందిన 30 సిమెంట్ బస్తాలు వర్షపు నీరులో తడిసిపోయాయి. తహసీల్దార్ కమల్‌సింగ్, ఎంపీడీవో వనజ పలు ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
లోకేశ్వరం,ఆగస్టు 28: లోకేశ్వరం నుంచి కల్లూర్ వైపు వెళ్లె మార్గంలో బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహించడంతో పోలీసులు రాకపోకలు నిలిపివేశారు.
భైంసా, ఆగస్టు, 28 : మహారాష్ట్రలో వర్షాలు కురవడంతో గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి నీరు రావడంతో అధికారులు మూడు గేట్లను ఎత్తివేశారు. ఇన్‌ప్లో కింద 17, 500 క్యూసెక్కుల నీరు రావడంతో ఔట్ ప్లో కింద 18, 500 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేశారు.
భైంసా, ఆగస్టు, 28 : భైంసాలో వివేకానంద చౌరస్తా, శివాజీ చౌక్, గాంధీ గంజ్ నుంచి బస్టాండ్ వెళ్లేమార్గంలో ఫిష్ మార్కెట్ వద్ద వరద ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎలాంటి ఘటనలు జరగకుం డా పట్టణ సీఐ గోపీనాథ్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఖానాపూర్, ఆగష్టు 28:ఖానాపూర్లోని రోడ్లు జలమయం కాగా వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. పట్టణ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని మున్సిపల్, రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. హైటెక్ సీటీ కాలనీకి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన తాత్కలిక రోడ్డు కోతకు గురికావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పశువుల కాపరులు, మత్స్యకారులు గోదావరి పరివాహక ప్రాంతలకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
ఖానాపూర్, ఆగష్టు 28: ఖానాపూర్, కడెం మండలాలకు సాగునీరు ఇచ్చే సదర్మాట్ ఆయకట్టుకు గురువారం వరద పెరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయడంతో సదర్మాట్కు వరద ఉధృతి వస్తుంది. సదర్మాట్ అడ్డుగోడపై నుంచి 70వేల క్యూసెక్కుల వరద గోదావరిలోకి ప్రవహిస్తుంది.
దస్తురాబాద్, ఆగస్టు 28 : దస్తురాబాద్ మండలంలోని బుట్టాపూర్, గొడిసేర్యాల, మున్యాల గ్రామాల్లో ఇండ్ల మధ్య వరద దూసుకుపోయింది. గొడిసేర్యాల రాజరాజేశ్వర ఆల యం కూడా నీటమునిగింది. పంటలు పూర్తిగా మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్యాల, బుట్టాపూర్, గోడిసేర్యాల గ్రామాల్లో వరద వచ్చి చేరిన ఇండ్లను తహసీల్దార్ బత్తుల విశ్వంబర్, సునీత, ఎస్ఐ సాయి కుమార్ పరిశీలించారు. నష్టాన్ని అంచనా వేయమని ఆర్ఐలు ఆర్తీ, రచనలను తహసీల్దార్ ఆదేశించారు.
కడెం, ఆగస్టు 28: కడెం ప్రాజెక్టు నీటిమట్టం 700 అడుగులు (4.699టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 695.475 అడుగులు (3.618టీఎంసీల) వద్ద ఉంది. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల వల్ల కడెం ప్రాజెక్టులోకి 44160 క్యూసెక్కుల వరద వచ్చి చేరడంతో అధికారులు ఆరు గేట్లను ఎత్తి వేసి గోదావరిలోకి 40482 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తహసీల్దార్ ప్రభాకర్, ఆయకట్టు ఈఈ విఠల్ పరివాహక గ్రామాల ప్రజలు, మత్స్యకారులు, పశుకాపరులు జాగ్రత్తలు పాటించి అటువైపు వెళ్లకూడదని హెచ్చరించారు.
ఖానాపూర్ రూరల్, ఆగసు ్ట28: తర్లపాడు, దిలావర్పూర్ గ్రామాల్లో రెంకోని వాగు ప్రవహించడంతో పంటలు నీట మునిగాయి. గొసంపల్లె గ్రామంలో వరద ఇండ్లలోకి ప్రవేశించింది. తర్లపాడు, పాత తర్లపాడు గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఖానాపూర్ తహసీల్దార్ సుజాత రెడ్డి, ఎంపీడీవో రత్నకర్‌రావు పర్యటించారు. వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. మేడంపల్లి సదర్మార్ట్ బ్యారేజ్ రాతి గోడల మీద నుంచి ఉప్పోంగి ప్రవాహిస్తుంది. మస్కాపూర్, సూర్జాపూర్, ఎల్లాపూర్ గ్రామాల్లో మత్తడి వాగుపై నుంచి నీరు ప్రవహించింది.
బోథ్, ఆగస్టు 28: బోథ్ మండలంలో వాగులు పొంగిపొర్లడంతో ధన్నూర్(బీ), నక్కలవాడ, అందూర్, సొనాల, చింతల్బోరి వంతెనలపై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో లోతట్టు ఇళ్లలోకి వర్షపు నీరు చేరగా, పత్తి, సోయా, కంది పంట పొలాల్లో నీరు నిలిచి ఉండడంతో దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తహసీల్దార్ సుభాష్ చందర్, ఎంపీడీవో రమేశ్, బోథ్ సీఐ వెంకటేశ్వర్ రావు, ఎస్ఐ శ్రీసాయి సిబ్బందితో కలిసి వంతెనలను పరిశీలించి సిబ్బందిని కాపలాగా ఏర్పాటు చేశారు.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొచ్చెర జలపాతం గురువారం పరవళ్లు తొక్కింది. పెద్ద వాగు, ధన్నూర్(బీ) వాగు నీటితో ఉప్పొంగి జలపాతం వద్ద ఎత్తిపోసింది.
బజార్హత్నూర్. ఆగస్టు 28: . బజార్హత్నూర్లోని గుట్టపనాధి నది ఉధృతంగా ప్రవహించి బస్టాండ్ పరిసర కాలనీల్లోకి వరద చేరింది. పత్తి, సోయా పంట పొలల్లోకి వరద చేరడంతో నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. బజార్హత్నూర్లోని చెరువులోకి భారీగా వరద చేరడంతో అలుగు దూకుతు ఉధృతంగా ప్రవహిస్తున్నది. తహసీల్దార్ శ్యాంసుందర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తహసీల్ కార్యాలయంలో వరద చేరి పనులకు అంతరాయం కలిగించింది.
నేరడిగొండ, ఆగష్టు 28 : నేరడిగొండ, వాంకిడిలో వరద ప్రభావిత ప్రాంతాలను బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పరిశీలించారు. నేరడిగొండ సర్సీసు రోడ్డు పలు కాలనీల గుండా తిరుగుతూ నీరు చేరిన ఇండ్లలోకి వెళ్లి పరిశీలించారు. నేరడిగొండలో వడూర్ అండర్ బ్రిడ్జి వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ప్రజలు బయటకు వెళ్లవద్దని సూచించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి అప్రమత్తం ఉండాలని సూచించారు. వాంకిడి సమీపంలోని వాగు వరద ఎక్కువగా ఉండడంతో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రజలు అధైర్య పడవద్దని బీఆర్ఎస్ నాయకులు అండగా ఉండారని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, వీడీసీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పెంట వెంకటరమణ, మాజీ ఉప సర్పంచ్ దేవేందర్‌రెడ్డి, నాయకులు రాథోడ్ సురేందర్, గులాబ్‌సింగ్, సాబ్లే సంతోష్‌సింగ్, శాదాబ్, శ్రీధర్‌రెడ్డి, రవి ఉన్నారు.
భీంపూర్, ఆగస్టు 28 : భీంపూర్ మండలంలో నిపాని, ధనోరా, అంతర్గాం, కరంజిలో వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నిపాని వాగు ఒడ్డున ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది. పోలీసులు పర్యవేక్షణ చేసి జాగ్రత్తలు తీసుకున్నారు. తహసీల్దార్ నలందప్రియ పెన్‌గంగ పరీవాహక గ్రామాలకు సూచనలు చేశారు. పెన్‌గంగకు ఎగువ మహారాష్ట్ర ప్రాజెక్టు నుంచి వరద చేరుతుండడంతో గుబిడి, టేకిడిరాంపూర్, కొజ్జన్గూడ ప్రజలు పనుల కోసం వాగులు దాటే పరిస్థితి లేక బస్సు సౌకర్యం లేక మహారాష్ట్ర ఉన్కేష్వవర్, మాండ్వి రూట్లలో వెళ్తున్నారు.
తాంసి(భీంపూర్), ఆగస్టు 28: ఈదులాసావర్గాం వద్ద చెట్లు విద్యుత్ స్తంభాలపై విరిగిపడటంతో ఆ రూట్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే అర్లి 33 కేవీ లైన్‌కు సంబంధించి తీగలపై చెట్లు పడటంతో మండలానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ లేక కార్యాలయాలు, బ్యాంకులు, పంచాయతీల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఇచ్చోడ, ఆగస్టు 28 : ఇచ్చోడ మండలంలోని గుండివాగు ఉధృతంగా ప్రవహిస్తున్నంది. గ్రామ శివారులోని వంతెనపై నుంచి వరద ప్రవహించడంతో ఆ మార్గంలో గాయత్రి జలపాతం పర్యటకులు, వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు వాగులు దాటవద్దని అధికారులు సూచించారు.
ఉట్నూర్ రూరల్, ఆగస్టు 28: ఉట్నూర్ మండలంలోని దంతన్‌పల్లి, పెర్కగూడ, శ్యాంపూర్, నాగాపూర్, పులిమడుగు, హస్నాపూర్ గ్రామాల్లోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గంగన్నపేట్‌లో వరి నాటు కొట్టుకు పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నార్నూర్, ఆగస్టు 28 : నార్నూర్, గాదిగూడ మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బారిక్రావ్గూడ, చిత్తగూడ, దన్నుగూడ, మారుగూడ, కునికసా గ్రామాల సమీపంలోని వాగులు వరదతో ఉపొంగాయి. ఆ గ్రామాల ప్రజలు బహ్యప్రపంచానికి దూరమయ్యారు. అలాగే ఖడ్కి, లోకారి(కే), అర్జుని మారుగూడ, గుండాయి, ఎంపల్లి, దుప్పాపూర్, మేడిగూడ లోలెవల్ కల్వర్టులపై వరద ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది.
జైనథ్, జూలై 28: సాత్నాల ప్రాజెక్టు నీరు గరిష్ఠ సామర్థ్యానికి చేరడంతో అధికారులు రెండు గేట్లు ఎత్తివేసి వరద దిగువకు వదిలారు. భోరజ్ మండలంలోని గిమ్మాలోని లోలెవల్ బ్రిడ్జిపై నుంచి భారీగా వరద ప్రవహించడంతో కోరట, అకోలి, కేదార్‌పూర్ గ్రామస్తులకు రాకపోకలు నిలిచిపోగా గ్రామాలు జలదిగ్భందనంలో ఉన్నాయి. తర్నం లోలెవల్ బ్రిడ్జిపై వరద ప్రవహించడంతో ఆదిలాబాద్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని కామాయి, మాండగడ, పెండల్వాడ గ్రామాలు వరదతో జలదిగ్భందనంలో ఉన్నాయి. సాత్నాల, పెన్‌గంగా నదులు ప్రవహించడంతో మాండగడ, పెండల్వాడ, కాప్రి, కరంజి, అకోలి, కోరట గ్రామాలకు సోయా, పత్తి, కంది, జొన్న పంటలు నీట మునిగాయి. సాత్నాల మండలంలోని పార్డి(కే) నాలుగు గొర్రెలు, రెండు మేకలు పార్డి(కే) వాగు వరదలో కోట్టుకపోయి మృతి చెందాయి.