మంచిర్యాల, మార్చి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా బుధవా రం కురిసిన అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టం మిగిల్చింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కురిసిన వర్షానికి వరి, జొన్న పంటలు దెబ్బతిన్నాయి. పత్తి పంట నేల రాలింది. మామిడి, బొప్పాయి సాగు చేస్తున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కన్నెపల్లి, నెన్నెల, భీమిని మండలాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. ఆసిఫాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో వరి పైరు నేలకొరిగింది. ఆసిఫాబాద్ జిల్లాలో జొన్న, మామిడి, బొప్పాయి, పుచ్చ తోటలు దెబ్బతిన్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ముసురు పడింది. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో 37.7, గాదిగూడాలో 30.3, భీంపూర్, నార్నూర్‌లో 29.4, జైనథ్‌లో 13.8, సత్నాలలో 13.3 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఆసిఫాబాద్ జిల్లా దహెగాంలో 77.3, చింతలమానేపల్లిలో 53, బెజ్జూర్‌లో 52.1, పెంచికల్పేట్లో 33.6, కౌటాలలో 15.9, మంచిర్యాల జిల్లా మందమర్రిలో 35.8, నస్పూర్‌లో 27.0, బెల్లంపల్లిలో 26.4, భీమినిలో 17.6, మంచిర్యాలలో 13.2, కన్నెపల్లిలో 12.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
చిన్న చినుకుపడినా మంచిర్యాల జిల్లా కేంద్రంలో కరెంట్ పోవడం తప్పనిసరిగా మారింది. బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలవ్వగానే తెల్లవారుజాము ఐదు గంటలకు కరెంట్ పోయింది. మంచిర్యాల టౌన్-2 ఏరియా హైటెక్ సిటీ, వికాస్‌నగర్, లక్ష్మీనగర్, గౌతమినగర్, రాళ్లపేట, బస్టాండ్ ఏరియా, జన్మభూమినగర్ ఇలా ముఖ్య ప్రాంతాల్లో కరెంట్ సమస్య ఎదురైంది. ఉదయం ఐదు గంటలకు పోయిన కరెంట్ తొమ్మిది గంటల వరకు కూడా రాలేదు. దీంతో జనం అవస్థలు పడ్డారు. కరెంట్ లేకపోవడంతో ఇంట్లో వంట పని నుంచి ఆఫీసుకు వెళ్లే వరకు అన్ని పనులు ఆలస్యమయ్యాయంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మెయింటేనెన్స్ పేరిట వారానికి రెండు రోజులు గంటల కొద్ది కరెంట్ కట్ చేస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు. రెండేళ్ల క్రితం 24 గంటల కరెంట్ ఇచ్చిన అధికారులు.. ఈ మధ్య కాలంలో మెయింటేనెన్స్ పేరిట ఎక్కువగా కరెంట్ కట్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదంటున్నారు. కొంతసేపు అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇలా గంటల తరబడి కరెంట్ తీసేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో నిత్యం కరెంట్ పోతున్నదని, అడిగితే పనులు చేస్తున్నామని చెప్తున్నారంటున్నారు. దీనిపై విద్యుత్‌శాఖ అధికారులను వివరణ కోరగా.. జంపర్ సమస్య వచ్చి కరెంట్ నిలిచిపోయిందన్నారు. తమ దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరించామన్నారు. మంచిర్యాల పట్టణవాసులు మాత్రం ఈ మధ్యలోనే కరెంట్ సమస్య తీవ్రమైందని, నిత్యం కోతలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.