సిసిసి నస్పూర్: వంద రోజుల సమగ్ర ఆరోగ్య శిబిరాలను ( Health camps ) సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ ( Sudhakar Naik ) పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఆయుష్మాన్ భారత్ మిషన్, భారత్ అభియాన్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపును నస్పూర్ నగరపాలిక పరిధిలోని సంఘమల్లయ్య పల్లెలో నిర్వహించారు.
ఈ సందర్భంగా సుధాకర్ నాయక్ క్షయ వ్యాధి ( Tuberculosis ) నిర్మూలనపై అవగాహన కల్పించారు. క్షయ రహిత సమాజ నిర్మాణం అందరి బాధ్యతని తెలిపారు. రెండు వారాలకు మించి దగ్గు ఉంటే క్షయ వ్యాధిగా అనుమానించి దగ్గర్లోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి తెమడ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందే ఈ వ్యాధి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజారోగ్య సమస్యగా పరిణమించిందని పేర్కొన్నారు.
శిబిరంలో క్షయ, హెచ్ఐవి, సిఫిలిస్, మధుమేహం, రక్తపోటులకు సంబంధించిన పరీక్షలు జరిపి అవసరమైన వారికి ఉచితంగా చికిత్సలు చేస్తామని వివరించారు. ఈ శిబిరంలో నస్పూర్ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి వెంకటేష్, హెల్త్ ఎడ్యూకేటర్ అల్లాడి శ్రీనివాస్, సీహెచ్ఓలు రమేష్, వెంకటేశ్వర్, సబ్ యూనిట్ అధికారి నాందేవ్, ఎంఎల్హెచ్పీ ప్రవల్లిక, క్షయ వ్యాధి జిల్లా కోఆర్డినేటర్ సురేందర్, హెచ్ఐవీ సూపర్వైజర్ రాజేష్, ఎస్టీఎస్ సాయరెడ్డి, మొబైల్ ఐసీటీసీ కౌన్సిలర్ శ్రీలత, హెపటైటిస్ కో ఆర్డినేటర్ మధు, ఏఎన్ఎంలు విజయ, రాధ, కవిత, ల్యాబ్ టెక్నీషియన్ అలేఖ్య, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.