‘వనాలు పెరగాలె.. వానలు పడాలె.. వానరాలు వాపస్ పోవాలె..’ అనే లక్ష్యంతో చేపట్టిన హరితహారం అంతరించిపోతున్న అడవులకు పునరుజ్జీవం పోసింది. తొమ్మిదేండ్లుగా సీఎం కేసీఆర్ కృషితో ఉద్యమంలా కొనసాగుతున్నది. ఇప్పటివరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 20 కోట్లకుపైగా మొక్కలు నాటగా.. అవి పెరిగి పెద్దవై మహావృక్షాలుగా మారాయి. నీడ, ఫలాలను అందిస్తుండగా.. పల్లెలు, పట్టణాలు, అటవీ ప్రాంతాలు పచ్చందాలతో కళకళలాడుతున్నాయి. అధికారులు తీసుకున్న ప్రత్యేక సంరక్షణ చర్యలు సత్ఫలితాల నిచ్చాయి. జియో ట్యాగింగ్, ట్యాంకర్ల ద్వారా నీరందించడం, జరిమానాలు విధించడం వంటి చర్యలతో నాటిన మొక్కలు బతికాయి. ఫలితంగా నాలుగు జిల్లాల్లో ఏడు శాతం అడవులు పెరుగగా.. ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తున్నది.
– ఆదిలాబాద్, జూన్ 18(నమస్తే తెలంగాణ)
చెట్టంటే అమ్మతో సమానం. అడగకుండానే అన్నీ ఇస్తుంది. పుట్టుక నుంచి చావుదాకా కల్ప‘తరువై’ నిలుస్తుంది. జీవకోటికి ప్రాణవాయువును ఇచ్చి, ఆయువు నిలుపుతుంది. పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది. సకాలంలో వానలు కురిపించి కరువు కాటకాలు లేకుండా చేస్తుంది. సమస్త మానవాళికి మనుగడనిస్తున్నది. అందుకే ప్రతి ఒక్కరం మొక్కలు నాటుదాం.. సంరక్షిద్దాం!
ఆదిలాబాద్, జూన్ 18(నమస్తే తెలంగాణ) ః ఉమ్మడి రాష్ట్రంలో అడవుల జిల్లా ఆదిలాబాద్ వ్యాప్తంగా పచ్చదనం పరిస్థితి అధ్వానంగా ఉండేది. స్మగ్లర్లు అడవులను యథేచ్ఛగా నరికివేయడంతో అంతరించి పోయాయి. ఫలితంగా అటవీ విస్తీర్ణం తగ్గింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పచ్చదనం పెంపొందించడానికి ఉపయోగపడింది. యేటా వానకాలం ప్రారంభం నుంచి మూడు నెలలపాటు హరితహారం కొనసాగుతోంది. హరితహారంలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొమ్మిదేళ్లలో దాదాపు 20 కోట్ల మొక్కలు నాటారు. అడవుల్లోని ఖాళీ ప్రదేశాలు, పల్లెలు, పట్టణాల్లో ఖాళీ స్థలాలు, రోడ్లకు ఇరువైపులా, చెరువు, పొలాల గట్లు, ప్రజలు తమ ఇండ్లలో మొక్కలు నాటేలా అధికారుల చర్యలు తీసుకున్నారు. వీటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో నాటిన మొక్కలను కాపాడడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేశారు. నాలుగు వేల మొక్కల సంరక్షణకు ఒకరిని నియమించి, ఎండాకాలంలో మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించారు. మొక్కల రక్షణ బాధ్యతను గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. హరితహారం మొక్కలను ధ్వంసం చేసినా, పశువులు మేసినా.. అందుకు బాధ్యులైన వారికి జరిమానా విధించారు. ఫలితంగా హరితహారం కార్యక్రమం విజయవంతమైంది. జిల్లాలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి చెట్లుగా మారాయి. తొమ్మిదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏడు శాతం పచ్చదనం పెరిగింది.
గ్రామాలు, పట్టణాల్లో నర్సరీలు
హరితహారంలో భాగంగా అవసరమైన మొక్కల పెంపకానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నది. అటవీ ప్రాంతాలు, రోడ్లకు ఇరువైపులా, ప్రకృతి వనాలు, ఇతర ఖాళీ ప్రాంతాల్లో నాటడానికి అవసరమైన మొక్కలతోపాటు ప్రజలు తమ ఇంటి ఆవరణలో పెంచుకోవడానికి అవసరమైన మొక్కలు సరఫరా చేసింది. ఇందు లో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో నర్సరీల పెంపకం చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,509 పంచాయతీలు, 12 మున్సిపాలిటీలు ఉండగా వాటి పరిధి మేరకు మొక్కల పెంపకం చేపట్టారు. దీంతో మొక్కల కొరత లేకుండా పరిష్కారం లభించినట్లయింది. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో అడవుల్లోని ఖాళీ ప్రాంతాల్లో పెంచడానికి మొక్కలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అడవుల్లో నరికివేతకు గురైన చెట్లు తిరిగి పెరిగేలా ఏఎన్ఆర్ పద్ధతిని అమలు చేశారు. ప్రధాన రహదారులతోపాటు గ్రామాల్లోని రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. పట్టణాల్లోని ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి హరితవనాలు, అర్బన్ పార్కులు పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లె, బృహత్ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ఫలితంగా అడవులు పెరిగాయి.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా హరితహారంలో భాగం గా వంద ఎకరాల్లో మావల హరితవనం ఏర్పాటు చేశా రు. దుర్గానగర్‌లో అర్బన్ పార్కును అందుబాటులోకి తీసుకొచ్చారు. 468 పంచాయతీలు, ఆదిలాబాద్ ము న్సిపాలిటీలో నర్సరీలు పెంపకం చేపట్టారు. 708 పల్లె ప్రకృతి వనాలు, 80 బృహత్ ప్రకృతి వనాల్లో మొక్కలు పెంచారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అడవులు ఆదిలాబాద్ జిల్లా పూర్వవైభవాన్ని సంతరించున్నాయి.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లాలో 4.35 కోట్ల మొక్కలు నాటారు. 396 పంచాయతీలు, మూడు మున్సిపాలిటీల్లో నర్సరీలు ఏర్పాటు చేశారు. చించోలి ఎక్స్‌రోడ్ సమీపంలో ఏర్పాటు చేసిన గండిరామన్న పార్కు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతుంది. 582 పల్లె ప్రకృతి వనాలు, 89 బృహత్ ప్రకృతి వనాలు ఉన్నాయి. హరితహారం కార్యక్రమం ఫలితంగా జిల్లాలో 7 శాతం గ్రీనరీ పెరిగింది.
మంచిర్యాల జిల్లాలో..
జిల్లాలో పచ్చదనం 44 శాతానికి చేరుకుంది. జిల్లా వ్యా ప్తంగా మూడు హరితవనాలు, 548 పల్లె ప్రకృతి వనా లు, 65 బృహత్ ప్రకృతి వనాలు ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతమైన మంచిర్యాల జిల్లాలో పచ్చదనం పెరగడం తో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుంది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
ఇప్పటి వరకు 4 కోట్ల మొక్కలు నాటారు. 335 పంచాయతీల్లో నర్సరీల పెంపకం చేపట్టగా.. ప్రతి పంచాయతీలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. 15 బృహత్ ప్రకృతి వనాలను ఏర్పాటు చేయగా గ్రామాల్లో ప్రజలకు ఆహ్లాదకరమై వాతావరణం నెలకొంది.