తాండూర్/మంచిర్యాలటౌన్/చెన్నూర్ టౌన్/చెన్నూర్ రూరల్/కన్నెపల్లి/భీమారం/ రెబ్బెన, జూన్ 1 : మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో శనివారం హనుమాన్ జయంతి ఉత్సవాలను భక్తులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామాలయాలు, హనుమాన్ ఆలయాల్లో వేదపండితులు, అర్చకులు మంత్రోచ్ఛరణల నడుమ పంచామృత, నమక చమక దశవిధ శాంతి మంత్రాలతో స్వామివారికి అభిషేకం, షాడశోపచార పూజ, తమలపాకు అర్చన, అష్టోత్తరం, పత్ర పూజలను శాస్ర్తోక్తంగా జరిపించారు. అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు.
తాండూర్ మండలం మాదారం టౌన్‌షిప్‌లోని శ్రీ కోదండ రామాలయం, బోయపల్లి హనుమాన్ ఆలయం, మండలంలోని పలు ఆలయాల్లో వేదపండితులు, ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. దీక్షాపరులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో గల హనుమార్ విగ్రహం ముందు వీర హనుమాన్ సేన సభ్యులు పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు. ఆ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు బింగి ప్రవీణ్, సభ్యులు పెనిమల్ల ఈశ్వర్, చేరాల వంశీ, నాగవెల్లి వినోద్, సుమన్, అర్కాల రాజు, ముద్దసాని గణేశ్, మహేందర్, శ్రవణ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. చెన్నూర్ పట్టణంలోని చోటా, బడా, పంచముఖ, పుప్పాల, రౌండ్ హనుమాన్ ఆలయాల్లో దీక్షాపరులు, భక్తులు పూజలు నిర్వహించారు.
మండలంలోని ఓత్కులపల్లి, ఆస్నాద్, కొమ్మెర, కిష్టంపేట, నాగాపూర్, ముత్తరుపల్లి, పొక్కూర్ గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓత్కులపల్లి ఆలయంలో నిర్వహించిన పూజల్లో మాజీ జెడ్పీటీసీ బెల్లంకొండ కరుణసాగర్ పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ మాడ సుమలత మాదవ రెడ్డి, కిష్టంపేట మాజీ సర్పంచ్ బుర్ర రాకేశ్ గౌడ్, ముత్తరావుపల్లిలో నాయకులు అయిత సురేశ్ రెడ్డి దంపతులు, నాగపూర్‌లో అన్నల తిరుపతి దంపతులు, బండారి సత్యనారాయణ దంపతులు పాల్గొన్నారు. కన్నెపల్లి మండలంలోని వీరాపూర్, జన్కాపూర్, కన్నెపల్లి, రెబ్బెన, జజ్జరవెల్లి, మాడవెల్లి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భజన కార్యక్రమాలు నిర్వహించారు.
భీమారం మండల కేంద్రంలోని శ్రీ అభయంజనేయ స్వామి 12 వార్సికోత్సం నిర్వాహకులు చెఱుకు భారతి-సరోత్తమరెడ్డి ఘనంగా నిర్వహించారు. నాయకులు పోడెటి రవి, బీసీ స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ తంగళ్లపల్లి అరుణ్‌కుమార్, జనంపల్లి సమ్మయ్య, ఎంపీడీవో రాధా రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. కోటపల్లి మండలంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని సుందరంగా ఆలకరించి, ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మందమర్రి మందమర్రి పట్టణం పాలచెట్టు ఏరియాలోని శ్రీపంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకం చేసి, పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు.
అనంతరం పంచకుండాత్మక హనుమత్ కవచ హోమం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, ఆలయ పూజారులు గోవర్ధనగిరి అనంతాచార్యులు, కృష్ణకాంతాచార్యులు, నరసింహాచార్యులు, శ్రీకాంతాచార్యుల మంత్రోత్ఛారణలతో హోమం నిర్వహించారు. అలాగే మూడో జోన్‌లోని రామాలయంలో, పట్టణంలోని మారుతినగర్, యాపల్ ఏరియాలలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీల ఆద్వర్యంలో అన్ని ఏర్పాట్లును చేశారు. రెబ్బెన మండలం గోలేటి శ్రీ కోదండ రామాలయంలో ఉదయం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, దండకం పఠనం, పూజలు, అన్నదానం ఏర్పాటు చేశారు.