ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ ( Khanapur ) పట్టణంలోని అంబేద్కర్ నగర్ ముత్యాల పోచమ్మ ( Mutyala Pochamma anniversary) ఆలయ మూడో వార్షికోత్సవ ఉత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ సభ్యులు ముందుగా ఆలయంలో పూజలు చేసి వార్షికోత్సవ ఉత్సవాలను ప్రారంభించారు.
ఆలయ అర్చకులు, పోతురాజుల ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు కొనసాగాయి. పలు కాలనీలకు చెందిన మహిళలు అమ్మవారి ఆలయం నుంచి గోదావరి వరకు శోభాయాత్రగా వెళ్లి, గోదావరిలో సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారి విగ్రహాలకు పుణ్యస్నానాలు చేయించి గంగాతెప్పకు పూజలు చేశారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి బిందెల్లో నీటితో పలు వీధుల గుండా ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు.
ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి గోదావరి జలాలను అమ్మవారి మూల విగ్రహానికి జలాభిషేకం చేశారు. సాయంత్రం మహిళలు ఊరేగింపుగా బోనాలు తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ ఉత్సవాలకు ఖానాపూర్తో పాటు సమీప గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.