దండేపల్లి, ఏప్రిల్22 : ఎంతో కష్టపడి పండించిన మక్కను అమ్ముకునేందుకు రైతాంగం అష్టకష్టాలు పడుతున్నది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయిస్తుండగా, ఇదే అదనుగా భావించి వారు తక్కువ ధరకే కొంటూ జేబులు నింపుకుంటున్నారు. ఇక ఎన్నో ఆశలతో సాగు చేసిన పంటకు సరైన ధర రాకపోవడంతో కర్షకలోకం కన్నీరుపెడుతున్నది..
యాసంగిలో జిల్లాలో ఎక్కువగా మక్క సాగు చేస్తుంటారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందవచ్చని మక్కువ చూపుతుంటారు. ఈ యేడాది 15 వేల ఎకరాల్లో పంట వేశారు. సాగు విస్తీర్ణం, దిగుబడి తగ్గడంతో ధరలు ఆశాజనకంగా ఉంటాయని రైతులు భావించారు. కానీ పంట చేతికి రాగానే ధరలు పతనం కావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు.
గతేడాది ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈసారి సాగునీటి కొరత, వాతావరణ పరిస్థితుల ప్రభావం, చీడపీడల బెడద, వన్యప్రాణుల దాడుల కారణంగా ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల లోపే దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. గత యేడాది బహిరంగా మార్కెట్లో క్వింటాల్‌కు రూ. 2200 నుంచి రూ. 2300 వరకు ధర పలికింది. ఈసారి రూ. 1800 వరకే పలుకుతుంది. పంట పూర్తిగా చేతికొచ్చేసరికి ధర మరింత తగ్గే అవకాశముందని రైతులు అంటున్నారు.
గతంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో బయటి వ్యాపారులు అధిక ధరక కొనుగోలు చేశారు. ఈ సారి కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులు అందినకాడికి దండుకుంటున్నారు. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఆలస్యం చేస్తున్నది. దీనినే ఆసరాగా చేసుకొని దళారులు మద్దతు ధర కంటే తక్కువకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది.
మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేస్తే మద్దతు ధర వచ్చేది. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దళారులకు అమ్ముకుంటున్నం. గతంలో కొనుగోలు కేంద్రాలు ఉండడంతో మంచి ధర వచ్చింది. గతేడాది క్వింటాలుకు రూ. 2300 ధర పలికింది. ఇప్పుడు రూ. 1800 ఇస్తున్నరు. మస్తు నష్టపోతున్నం.
-గోపతి లక్ష్మయ్య, రైతు, తాళ్లపేట