‘ఫొటోలో కనిపిస్తున్న పాఠశాల భవనం కస్ర గ్రామంలోనిది. ఇక్కడి పాఠశాలలో ఐదు తరగతులు ఉండగా.. 11 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒకే ఉపాధ్యాయురాలు జయంతి పని చేస్తారు. ప్రహరీ లేదు, తాగునీటి సౌకర్యం లేదు, టాయిలెట్స్ లేవు. గ్రౌండు లేదు. సుమారు 40 మందికి పైగా పిల్లలు కుభీర్, భైంసా, పల్సి లోని ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ఐదారేళ్లుగా పాఠశాల భవనం శిథిలమై కూలిపోయే పరిస్థితిలో ఉంది. ఇంకో భవనంలో ఐదు తరగతుల విద్యార్థులను ఒకే చోట కూర్చొబెట్టి ఒకే టీచర్ బోధిస్తున్నది. ఈ పరిస్థితుల్లో గ్రామంలోని నిరుపేద కుటుంబాల పిల్లలే చదువుతున్నారు. మిగతా వారు ప్రైవేటుకే వెళ్తున్నారు. ఇది పిల్లలకు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత. కూలి పోయే భవనాన్ని చూసి తల్లిదండ్రులు పాఠశాలకు పిల్లలను పంపడం లేదు.
కుభీర్, జూన్ 10 ః కుభీర్ మండల విద్యావనరుల కేంద్రంతోపాటు పల్సి, సిర్పెల్లి(హెచ్), కస్ర, కుప్టి, రాజురా, ధార్కుభీర్, జాంగాం, పాత సాంవ్లి, సొనారి, రంజిని గ్రామాల్లోని 29 ప్రభుత్వ పాఠశాల భవనాలు ఏళ్లుగా శిథిలావస్థలో మగ్గుతున్నాయి. కొన్ని చోట్ల వాటినే వినియోగిస్తుండగా.. మరికొన్ని చోట్ల ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లోని తల్లిదండ్రుల్లో అభద్రతాభావం వ్యక్తం అవుతోంది. మండలంలో ఏడు హైస్కూళ్లు, 11 యూపీఎస్‌లు, 46 ప్రైమరీ పాఠశాలలు ఉన్నాయి. కేజీబీవీ, ఏహెచ్ఎస్ డోడర్న, ఏహెచ్ఎస్ కుభీర్ సహా 3147 మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు విద్యాశాఖ లెక్కలు చెబుతున్నాయి.
చాలా పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం, టీచర్ల కొరత వేధిస్తోంది. సంఖ్యకు తగ్గ ఉపాధ్యాయుల లేక ఒక్కో పాఠశాల మూతబడుతోంది. తాజాగా శుక్రవారం అంతర్ని గ్రామంలో పురాతన పాఠశాల భవనం ప్రమాదవశాత్తు కూలి పోవడంతో నలుగురు విద్యార్థులు గాయపడిన ఘటన తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేస్తున్నది. ఈ విషయమై ఎంఈవో విజయ్‌కుమార్‌ను అడుగగా.. పాడుబడ్డ, శిథిలమైన ప్రభుత్వ పాఠశాల భవనాలను గుర్తించి కూల్చి వేయమని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆర్అండ్బీ అధికారులు పాఠశాలను ఆదివారం నుంచి సందర్శిస్తున్నారు. వారి నివేదిక ఆధారంగా చర్యలు చేపడతాం.