కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : సర్కారు దవాఖానల నిర్వహణలో కీలకపాత్ర పోషించే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందక అవస్థలు పడతున్నారు. నాలుగు నెలలవుతున్నా పట్టించుకున్న నాథుడు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నెల 17 నుంచి సమ్మెకు దిగుతున్నారు.
వైద్య విధాన పరిషత్ పరిధిలోని జైనూర్, వాంకిడి, తిర్యాణి, కెరమెరి, సిర్పూర్-టీ, కాగజ్‌నగర్‌తో పాటు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో సుమారు 100 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి నాలుగు నెలలుగా వేతనాలు రాక అవస్థలు పడుతున్నారు. వార్డులు శుభ్రం చేయడం, సెక్యూరిటీ విధులు నిర్వహించడం, పేషెంట్లకు అన్ని రకాల సేవలందించే ఈ చిరు ఉద్యోగులకు సకాలంలో జీతాలివ్వకపోవడంతో కుటుంబ పోషణకు అష్టకష్టాలు పడుతున్నారు.
తమ వేతనాలు చెల్లించాలని జనవరి 20న హాస్పిటల్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లినా ఇంత వరకు స్పందించలేదని, కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం, ఏజెన్సీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, అందుకే ఈనెల 17 నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని కార్మికులు స్పష్టం చేశారు. ఈ విషయమై ఇప్పటికే కలెక్టర్‌తో పాటు అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు.