ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, అక్టోబర్ 16 : రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక) అన్నారు. కుమ్రం ఆసిఫాబాద్ జిల్లాలో ఆమె బుధవారం పర్యటించారు. ఆసిఫాబాద్ మండలంలో గుండి గ్రామంలో పదో తరగతి వరకు ఉన్నతీకరించిన పాఠశాలను ప్రారంభించారు. పెద్దవాగుపై వంతెన, రోడ్డును సాధ్యమైనంత త్వరగా నిర్మిస్తామని తెలిపారు.
కనరగాం రహదారి కూడా పూర్తి చేస్తామన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచ్ అడుగగా మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం తిరిగి వచ్చేటప్పుడు వాగులో నడుచుకుంటూ వచ్చారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ ఉన్నత పాఠశాల ఆవరణలో బీహెచ్ఈఎల్ సంస్థ సౌజన్యంతో సంచార సైన్స్ ల్యాబ్ బస్సును మంత్రి ప్రారంభించారు. జిల్లాకు రెగ్యులర్ డీఈవోను నియమించాలని, అల్పాహార పథకాన్ని పారంభించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి మంత్రి దృష్టికి తీసుకురాగా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం కలెక్టరేట్లో గ్రామీణాభివృద్ధి శాఖ, పేదరిక నిర్మూలన సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు. 270 మహిళా సంఘాలకు రూ.16 కోట్ల బ్యాంకు చెక్కును, రూ.2 కోట్లు స్త్రీ నిధి రుణం చెక్కును మహిళా సంఘాలకు అందించారు. పీవీటీజీ గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం ప్రధానమంత్రి జన్ మన్ ధన్ పథకం కింద మొబైల్ వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, నాయకులు మల్లేశ్, రవీందర్, చరణ్‌దాస్, డీఎంహెచ్‌వో తుకారాం, డీఆర్డీవో దత్తారాం, అధికారులు, పాల్గొన్నారు.
వట్టివాగు రిజర్వాయర్ కట్ట నిర్మాణానికి శంకుస్థాపన..
రెబ్బెన, అక్టోబర్ 16 : వట్టివాగు రిజర్వాయర్ రక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. బెల్లంపల్లి ఏరియా ఖైర్గూడ ఓసీపీ సమీపంలోని వట్టివాగు రిజర్వాయర్ రక్షణ కట్ట నిర్మాణానికి సింగరేణి సంస్థ నిధుల(రూ.11.24కోట్ల)తో కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఎమ్మెల్సీ దండే విఠల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బెల్లంపల్లి ఏరియా జీఎం శ్రీనివాస్, ఇరిగేషన్ ఈఈ గుణవంతరావుతో కలిసి శంకుస్థాపన చేశారు.రైతులు, ప్రజల సంక్షేమం కోసం వట్టివాగు రిజర్వాయర్ రక్షణకు అన్ని చర్యలు చేపడుతామన్నారు. ఈ సందర్భంగా పలువురు మంత్రికి వినతిపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, యూనియన్ నాయకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
మంత్రికి వినతులు..
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, అక్టోబర్ 16 : జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రి సీతకకు పలువురు వినతి పత్రాలు అందజేశారు. జిల్లాలో విద్యా, వైద్య రంగాలోల అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రేకు అనేక సందర్భాలోల వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోవడంలేదని, వెంటనే కలెక్టర్‌ను మార్చాలని మంత్రికి డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడిసెల కార్తిక్ వినతి పత్రం అందించారు. అలాగే ఆసిఫాబాద్ మండలంలోని రాజురా గ్రామా న్ని నూతన జీపీగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు బొట్టుపల్లి గోపాల్, శ్రీకాంత్, రాజేందర్, నరేశ్ తదితరులు కోరారు.