శ్రీరాంపూర్, మే 14 : 13 దశాబ్దాల సింగరేణి చరిత్రలో మొదటిసారిగా మహిళా డంపర్ ఆపరేటర్లను తీసుకునేందుకు సంస్థ చర్యలు చేపడుతున్నది. ప్రభుత్వ సూచనల మేరకు సింగరేణి యాజమాన్యం మహిళా డంపర్ ఆపరేటర్ల నియామకానికి శ్రీకారం చుడుతున్నది. ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు, ఓవర్ బర్డెన్ను గని క్వారీ నుంచి ఉపరితలానికి తీసుకువచ్చేందుకు యాజమాన్యం 60 నుంచి 100 టన్నుల భారీ డంపర్లను వినియోగిస్తున్నది. గత 50 ఏళ్లుగా మగ ఆపరేటర్లు మాత్రమే భారీ డంపర్లను నడుపుతూ వస్తున్నారు.
తాజాగా.. సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ గనుల్లో డంపర్ ఆపరేటర్లుగా మహిళలను తీసుకునేందుకు దరఖాస్తులు కోరింది. మొదట దాదాపు 35 మంది ముందుకు వచ్చారు. భారీ డంపర్లను నడిపేందుకు సాధారణ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు హెవీ లైసెన్స్ కూడా అవసరమున్నది. ఈ నేపథ్యంలో సిరిసిల్లలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ సిల్స్ (టైడ్స్)అనే సంస్థ ద్వారా ఆసక్తి గల మహిళలకు కంపెనీ ఖర్చులతో భారీ వాహనాలపై ఉచిత డ్రైవింగ్ శిక్షణ అందించింది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న 13 మంది మహిళా ఉద్యోగులు తాము డంపర్ ఆపరేటర్లుగా పనిచేయటానికి సిద్ధంగా ఉన్నామని కంపెనీకి తెలిపారు. త్వరలో వీరికి డంపర్ ఆపరేటర్ల నియామకల్లో అవకాశం కల్పించనున్నట్లు యాజమాన్యం తెలిపింది.