చెన్నూర్ రూరల్, ఆగస్టు 26 : గ్యాస్ లీకై రెండిళ్లు దగ్ధం కాగా, యువతి పెండ్లి, ఇంటి నిర్మా ణం కోసం దాచుకున్న డబ్బులు, బంగారం కాలిపోయిన ఘటన చెన్నూర్ మండలం ఆస్నాద్‌లో సోమవారం జరిగింది. ఆస్నాద్ గ్రామానికి చెందిన సోదరులు ఇంగిలి శ్రీనివాస్, లింగయ్య తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం 9 గంటలకు జైపూర్ మండలంలోని వేలాల ఆలయానికి వెళ్లారు.
ఈ క్రమంలో 10 గంటల ప్రాంతంలో లింగన్న ఇంటిలోని గ్యాస్ సిలిండర్ లీకై ఒక్కసారిగా పేలింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి శ్రీనివాస్, లింగయ్య ఇండ్లు దగ్ధమయ్యాయి. పే లుడు శబ్ధానికి చుట్టు పక్క వాళ్లంతా పరుగు లు తీశారు. లింగన్న కూతురుకు ఇటీవల వరపూజ అయింది. కూతురు పెళ్లి కోసం దాచిన 8 తులాల బంగారంతో పాటు రూ. 4 లక్షలు, అలాగే శ్రీనివాస్ నూతన గృహ నిర్మాణం కోసం దాచుకున్న రూ. 2 లక్షలు, 2 తులాల బంగారం కాలిపోయింది.
ఇండ్లలోని సామగ్రి సైతం కాలిబూడిదైనట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫైర్‌స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చింది. చెన్నూర్ ఎస్ఐ సుబ్బారావు కాలిపోయిన ఇండ్లను పరిశీలించారు. మొత్తం రూ. 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.