నిర్మల్ అర్బన్, ఆగస్టు 29 : నిర్మల్ జిల్లాలోని వైన్స్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. గురువారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పట్టణంలోని విశ్వనాథ్‌పేట్ కాలనీకి చెందిన రాపెన్వాడ్ రఘు, ఉత్తం పాండు పవర్, మక్కల శ్రీను, జాదవ్ దిలీప్, రాపని సోని అనే మిత్రులు రోజు సాయంత్రం వారి పనుల అనంతరం మద్యం తాగేవారు. కూలీపని ద్వారా వచ్చే డబ్బులు మద్యం, జల్సాలకు సరిపోకపోవడంతో దొంతనాలు చేయాలని నిశ్చయించుకున్నారు. మొదట పథకం ప్రకారం మయూరి హోటల్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర వైన్స్, సిరి వైన్స్‌లో దొంగతనం చేశారు.
అదే తరహాలో మంగళవారం అర్ధరాత్రి సోఫినగర్లోని సాయి వైష్ణవి బార్ అండ్ రెస్టారెంట్లో కెమరాలు, సీసీ టీవీలను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి కౌంటర్లోని రూ.40 వేల నగదు, కంప్యూటర్, మద్యం బాటిళ్లను దొంగలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. దొంగతనం చేసిన 24 గంటల్లోనే ఏ1 రఘు, ఏ2 ఉత్తం పాండు రంగ పవర్, ఏ3 మక్కల శ్రీను, ఏ4 జాదవ్ దిలీప్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. రూ.2 వేల నగదును స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్‌కు తరలించారు. రాపని సోని పరారీలో ఉన్నట్లు తెలిపారు. 24 గంటల్లో దొంగలను పట్టుకున్న సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై సాయికృష్ణ, రవి, రమేశ్, సౌకత్, హోంగార్డు సతీశ్లను ఎస్పీ అభినందించారు.