బెల్లంపల్లి, మే 9 : బెల్లంపల్లి మున్సిపాలిటీలోని బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిచిన వార్డులకు నిధులు కేటాయించడంలో వివక్ష చూపుతున్నారని, అన్ని వార్డులనూ సమానంగా చూడాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు తాండ్ర స్రవంతి, ఆసాది మధు అన్నారు. శనివారం బెల్లంపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంపల్లి రాజం, గోగర్ల స్వప్న, బత్తుల అనిత, సల్ల కృష్ణవేణి, దొంతుల రాజ్‌కుమార్, కొయ్యడ ప్రసన్నకుమారి, ధరావత్ తిరుమలవాసు, బెడ్డెల సౌజన్య, ఈట కమల, నాయకులతో కలిసి వారు మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో 34 వార్డులు ఉండగా అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడంలో విఫలమయ్యారని విమర్శించారు.
బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిచిన వార్డులకు నిధులు కేటాయించడంలో ఎమ్మెల్యే సవతి తల్లిప్రేమ ప్రదర్శిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు డీఎంఫ్టీ ద్వారా రూ. 10 కోట్లు నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో లక్ష జనాభా, 53వేల ఓటర్లు ఉండగా, ఆ ప్రాతిపదికన రూ.కోటి యాభూ లక్షల నిధులు కేటాయించాల్సి ఉండగా కేవలం రూ. 74 లక్షలు మాత్రమే కేటాయించి మిగతా నిధులను ఇతర మండలాలకు కేటాయించి బెల్లంపల్లి మున్సిపాలిటీపై పక్షపాత ధోరణి చూపిస్తున్నారని ఆరోపించారు.
ఈ నిధులను కూడా మున్సిపాలిటీ ఇంజినీరింగ్ విభాగం ద్వారా టెండర్ పిలిచి పనులు చేయించాల్సి ఉండగా ఎంపీడీవో ద్వారా పనులు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్ ద్వారా కాకుండా ఎమ్మెల్యే పీఏలకు ముడుపులు ఇచ్చిన కాంట్రాక్టర్లకు మాత్రమే నామినేటెడ్ ద్వారా కట్టబెట్టి నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. సీఎస్ఆర్ నిధులు రూ. ఐదు కోట్లు మంజూరు కాగా మున్సిపాలిటీకి కోటి 75 లక్షలు కేటాయించాల్సి ఉండగా కోటి 11 లక్షలు మాత్రమే మంజూరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడవ వార్డుకు రూ. 34 లక్షలు కేటాయించిన ఎమ్మెల్యే మిగతా నిధులను కేవలం పది వార్డులకు మాత్రమే పరిమితం చేశారని ఆరోపించారు.
ఇప్పటి వరకు మంజూరైన అభివృద్ధి పనులను రద్దు చేసి టెండర్ ప్రాతిపదికన, పార్టీలకతీతంగా అన్ని వార్డులకు సమానంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అమృత్ స్కీం ద్వారం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి స్ధానిక ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కారం కోసం మంజూరైన కేంద్ర ప్రభుత్వ నిధులు రూ. 60 కోట్లు మంజూరైన పనులు చేయించడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శించారు. రడగంబాలబస్తీలోని జాతికుంట చెరువు వద్ద ట్యాంకు నిర్మించి,గోదావరి నీటిని సరఫరా అయ్యేవిధంగా చూడాల్సిన అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులుగా ఎన్నిక అవుతారనే భయంతోనే నియామకం చేపట్టడం లేదని విమర్శించారు. గత నెల 17న కో ఆప్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న భర్తీకి నోచుకోవడం లేదన్నారు.
నెలకోసారి టూరిస్టుగా వస్తున్న ఎమ్మెల్యే !
ఎమ్మెల్యే గడ్డం వినోద్ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, ఇతర చెక్కులను పంపిణీ చేయడానికే పరిమితమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉంటానని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన వినోద్ చుట్టపు చూపుగా నెలకోసారి టూరిస్టుగా నియోజకవర్గానికి రాకపోకలు సాగిస్తున్నారని ఆరోపించారు. తమ సమస్యల పరిష్కరించాలని ప్రజలు క్యాంప్ కార్యాలయానికి వెళ్తే అక్కడ పీఏలు, కాంగ్రెస్ నాయకులే ఉంటున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రతి రోజూ నియోజకవర్గ ప్రజలకు క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉండేవారని గుర్తు చేశారు. చిన్నయ్య లేని సమయంలో సతీమణి జయతార కూడా సమస్యలను విని దరఖాస్తులను తీసుకునేదని పేర్కొన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధిపై ఏ ఒక్క కౌన్సిలర్‌తో కూడా ఎమ్మెల్యే వినోద్ చర్చించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బెల్లంపల్లి మున్సిపాలిటీని 14 బీఆర్ఎస్, 14 కాంగ్రెస్, ఐదు ఇండిపెండెంట్లుగా విభజించి పాలన చేస్తున్నారని ఆరోపించారు. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు వివాదం నెలకొని ఇంటిగ్రేటేడ్ మార్కెట్ వ్యాపారులు బంద్ పాటించిన ఎమ్మెల్యే పట్టించుకోలేదన్నారు. ఎమ్మెల్యే వినోద్‌ను హైదరాబాద్‌లో కలుద్దామని వెళ్లిన వ్యాపారులకు రెండు రోజుల తర్వాత ఎమ్మెల్యే కలుస్తారని పీఏలు చెప్పి ఆయనను కల్పించకుండానే వెనుకకు పంపిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇరు వర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించినట్లు వివరించారు. మున్సిపల్ సాధారణ సమావేశాలకు మంచిర్యాల, లక్షెట్టిపేట ఇతర మున్సిపాలిటీల్లో మీడియాను అనుమతించిన బెల్లంపల్లిలో మాత్రం నిషేధం విధిస్తున్నారని ఆరోపించారు. ఈవిషయమై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీడీఎంఏని కలిసి విన్నవిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తాండ్ర రామకృష్ణ, గోగర్ల సత్యనారాయణ, కొయ్యడ వెంకటేశ్, ఖలీం, తదితరులున్నారు.