నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 25 : యూ-బిట్ క్రిప్టో కరెన్సీ మోసం కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. ప్రజలను మోసం చేసిన ఘటనలో గతంలో ఐదుగురిని అరెస్టు చేయగా.. బుధవారం మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిలో కడెం మండలంలోని కన్నాపూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న దాసరి రమేశ్, ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సొనాల ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న బొమ్మిడి ధనుంజయ్, నిర్మల్ పట్టణంలోని దివ్యనగర్ కాలనీకి చెందిన వెంకటేశ్, కుభీర్ మండలంలోని దౌజినాయక్ తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా యూ బిట్, క్రిప్టో కరెన్సీ పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం, అధిక రాబడులు వస్తాయని తప్పుడు వాగ్ధానాలు ఇచ్చి ప్రజల్లో ఆశలు రేకెత్తించి పెట్టుబడులు పెట్టేందుకు కీలకపాత్ర పోషించారు.
యూ బిట్ పథకం వెనుక ఉన్న ప్రధాన కుట్రదారుడిని పోలీసులు గుర్తించారు. భారతదేశం అంతటా పెద్ద సంఖ్యలో ప్రజలను మోసం చేసి ఈ స్కామ్‌ను నిర్వహించింది బ్రిజ్ మోహన్ సింగ్ అని పోలీసులు తేల్చారు. ఇతనిపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఇతను క్రిప్టో కరెన్సీ ముసుగులో పెద్ద ఎత్తున పెట్టుబడి దారులతో పెట్టుబడులు పెట్టించినట్లు గుర్తించారు. ఇటీవల అరెస్టయిన వారు ఎనిమిది నెలలుగా రహస్య సమావేశాలు నిర్వహించేందుకు, నాలుగు వేర్వేరు దేశాలకు వెళ్లారని, దీని పరిధిని విస్తరించడానికి సమావేశాలు నిర్వహించినట్లు విచారణలో తేల్చారు.
క్రిప్టో కరెన్సీలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన ఖాతాలను పోలీసులు స్తంభింపజేశారు. కోట్లాది రూపాయలతో ఈ వ్యవహారం కొనసాగుతుండగా.. ఈ వ్యవహారంలో ముడిపడి ఉన్న 11 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. ఆస్తులను గుర్తించే ప్రక్రియలో పోలీసులు నిమగ్నమయ్యారు. యూ బిట్, క్రిప్టో కరెన్సీ బాధితులు ముందుకొచ్చి స్టేట్మెంట్ను అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఫిర్యాదు చేస్తే కేసు దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు అండగా ఉంటామన్నారు. బాధితులు కోల్పోయిన పెట్టుబడులు తిరిగిచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. దర్యాప్తు అధికారి, ఏఎస్పీ అవినాశ్, సహాధికారులు గోపీనాథ్, ఎస్సైలు లింబాద్రి, దేవేందర్, రవి, సాయికృష్ణ, గౌష్లను ఎస్పీ జానకి షర్మిల ప్రశంసించారు.
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 25 : యూ-బిట్ కాయిన్ వ్యవహారంలో ఆర్థిక నేరాలకు పాల్పడిన ఉపాధ్యాయులు, డీఈవోపై చర్యలు తీసుకోవడమే కాకుండా వారిని సస్పెండ్ చేయాలని పీఆర్టీయూ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు యాకటారి సాయన్న అన్నారు. బుధవారం నిర్మల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ వ్యవహారంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు ఉన్నారని, వీరిపై పోలీసు అధికారులు నిఘా పెంచాలన్నారు.
ఉపాధ్యాయులు లేక విద్యార్థుల భవిష్యత్ అంధకారంలోకి నెట్టి వేయబడుతోందని డీఈవోపై నమ్మకం లేనందున కలెక్టర్ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎంఎన్‌వో(మండల నోడల్ ఆఫీసర్) సీనియర్ పీజీ హెచ్ఎంలకు బదులుగా జూనియర్లను నియమించడం సమంజసమని, వారిని ఎఫ్ఏసీ ఎంఈవోలుగా నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేశ్, చంద్రశేఖర్, నర్సయ్య, గంగయ్య, మధుసూదన్ ఉన్నారు.