ఆదిలాబాద్, జనవరి 10(నమస్తే తెలంగాణ) : ఉద్యోగాల పేరిట నకిలీ ఆర్డర్లు సృష్టించి నిరుద్యోగులను మోసం చేస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను ఆదిలాబాద్ పోలీసులు గుట్టురట్టు చేశారు. శనివారం ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనంత ఈ సొల్యూషన్స్ విద్యాదాన్ ఎన్జీవో నిర్వాహకుడు వరంగల్ జిల్లా గిర్మాజిపేటకు చెందిన జడ్డుబోయిన మధూకిరణ్, హన్మకొండ జిల్లా వెంకటాపూర్‌కు చెంది న మాదాసు సుధాకర్, గోదావరిఖనికి చెందిన నమ్మని సతీశ్, హైదరాబాద్‌కు చెందిన సుజాత ఠాకూర్, లావణ్యలు ముఠాగా ఏర్పడ్డారు.
ప్రభుత్వ కళాశాలలు, విద్యాసంస్థల్లో ఉద్యాగాలు ఇప్పిస్తామంటూ ప్రచారం నిర్వహించారు. విద్యాదన్ అనే సొసైటీని రిజిస్టర్ చేసి కేంద్ర ప్రభుత్వ పథకం విద్యాంజలి, సీఎన్ఆర్ నిధులు కాజేయడానికి పన్నాగం పన్నా రు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోపాటు వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఏజెంట్లను నియమించుకొని ఉద్యోగాలు ఇప్పిస్తాంటూ ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.1 లక్ష నుంచి రూ.2.5 లక్షలు వసూలు చేశారు. మూడు జిల్లాల్లో దాదాపు 240 మంది వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు సృష్టించి ఇచ్చారు.
ఆర్డర్లు ఇచ్చిన వారికి మూడు నెలల వేతనాలు ఇచ్చి ఆ తర్వాత చేతులెత్తేశారు. వేతనాలు రాకపోయే సరికి అనుమానంతో బాధితులు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. జిల్లాలో ఏజెంట్లుగా ఉన్న రాహుల్, కోవ విఠల్, వరలక్ష్మీలపై కేసులు నమోదు చేసిన పోలీసుల వారిని అరెస్ట్ చేశారు. కొన్ని రోజులుగా తప్పించుకొని తిరుగున్న ముగ్గురు నిర్వాహకులు జట్టుబోయిన మధూకిరణ్, మాదాసు సుధాకర్, నమ్మని సతీశ్లను శనివారం అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ జీవన్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్, ఎస్సైలు గోపీకృష్ణ, నాగనాథ్, అశోక్‌లు ఉన్నారు.