నిర్మల్ టౌన్, మార్చి 28 : పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి అంగన్వాడీ కేంద్రాల్లో పోషక విలువలున్న ఆహారాన్ని అందించి చికిత్సలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా శిశు సంక్షేమశాఖ, వైద్య ఆరోగ్యశాఖ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతినెలా గర్భిణులకు ఆరేండ్లలోపు పిల్లలకు పోషక విలువలున్న ఆహార కిట్లను అందించినట్లు చెప్పారు. పోషణ్ అభియాన్ ద్వారా బరువు తక్కువగా ఉన్న పిల్లలను గుర్తించి బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రక్తహీనత ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆకుకూరలు ఎక్కువగా తినేలా చూసి అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ అడిషనల్ డైరెక్టర్ రసూల్ బీ, జిల్లా శిశు సంక్షేమశాఖ అధికారి విజయలక్ష్మి, జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్, అధికారులు పాల్గొన్నారు.
చిరుధాన్యాలతోనే సంపూర్ణ ఆరోగ్యం
చిరుధాన్యాలతో చేసిన ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని కలెక్టర్ వరుణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని చించోలి(బీ) గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ్ పక్వాడ వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిరుధాన్యాల్లో పీచు పదార్థాలు, ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయన్నారు. మెరుగైన ఆరోగ్యం కోసం మనం తీసుకునే ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా చూసుకోవాలన్నారు. ఔషధ గుణాలున్న కొర్రలు, సామలు, రాగులు, అరిసెలు, జొన్నలు, సజ్జలు లాంటి చిరుధాన్యాలతో మెరుగైన పొందవచ్చన్నారు. గర్భిణులు, కిశోర బాలికలు తప్పకుండా పోషక విలువతో కూడిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారన్నారు. అనంతరం పోషణ్ పక్వాడ కమిటీ ఆఫీసర్ తల్లుల పోషక విలువలు, ఎత్తు, బరువు తదితర విషయాలను మహిళలను అడిగి తెలుసుకొని సంతృష్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆధ్వర్యంలో చిన్నారులకు అన్నప్రాసన, గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోషణ్ పక్వాడ కమిటీ ఆఫీసర్ ఎస్కే రసూల్‌బీ, ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ వెంకటరమణారెడ్డి, ఐసీడీఎస్ పీడీ విజయలక్ష్మి, ఇన్చార్జి సీడీపీవో విజయగౌరి, ఎంపీడీవో సరోజ, డాక్టర్ సుభాష్, హెల్త్‌సూపర్ వైజర్ సరస్వతి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఏఎన్ఎం నుస్రాత్బేగం, ఆయా గ్రామాల అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.