మాగనూర్ : రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Chittem Rammohan Reddy ) అన్నారు. సీసీఐ నిబంధనలతో జిన్నింగ్ మిల్లు యజమానులు గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటుండడంతో సీసీఐ వైఖరికి నిరసనగా సోమవారం నుంచి మిల్లులను మూసివేశారు.
కపాస్ కిసాన్ ఆప్ ద్వారా స్లాట్‌బుక్ చేసుకున్న పత్తి రైతులు పత్తిని మార్కెట్‌ను తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా జిన్నింగ్ మిల్లులను మూసివేశామని, పత్తిని కొనుగోలు చేయడం లేదని యజమానులు చెప్పడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. దీంతో పత్తి రైతులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో పలు చోట్ల నిరసనలు నిర్వహించారు.
ఇందులో భాగంగా మాగనూర్ మండలం వద్వాట్ గేటు జాతీయ రహదారిపై బైఠాయించి రైతులు ధర్నా నిర్వహించారు. గంటకు పైగా ధర్నా నిర్వహించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రైతుల ధర్నాకు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీఐ పోకడలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి ఉమ్మడి మండల అధ్యక్షుడు నల్ల నర్సప్ప, మాగనూరు కృష్ణ ,మక్తల్ మండలాల రైతులు, బిఆర్ఎస్ నాయకులు నరసింహ గౌడ్, గవినోల నరసింహారెడ్డి, ఈశ్వర్ యాదవ్, వసంత్ రెడ్డి తిమ్మన్న, రైతులు రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.