ఎదులాపురం, ఆగస్టు 24 : ఆదిలాబాద్ రూరల్ మండలంలో వర్ష ప్రభావిత ప్రాంతాలను ఆదివారం మాజీ మంత్రి జోగు రామన్న సందర్శించారు. వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అన్నదాతలకు మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. ప్రకృతి ప్రకోపంతో రైతులు పంటలు నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం సర్వే నిర్వహించి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తంతొలిలో గంగన్న అనే రైతు నాలుగు ఎకరాల్లో పత్తి వేశాడని, పత్తి పంట పూర్తిగా దెబ్బతిని నష్టపోవడంతో ట్రాక్టర్‌తో తొలగించి చదును చేస్తున్నాడన్నారు. మళ్లీ వేయడానికి ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలన్నారు. రైతుల నష్టం గురించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన ఎమ్మెల్యే గత బీఆర్ఎస్పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు ఎదురైన ఇలాంటి విపతర పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ నగేశ్ ప్రశ్నించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని పేరొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన ప్రీమియం కట్టెంత వరకు రైతుల పక్షాన పోరాడుతామన్నారు. కేసీఆర్ రైతులకు రూ.10 వేల నష్టపరిహారం అందిస్తే సరిపోదు అని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎకరాకు రూ.25 వేల పరిహారాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గండ్రత్ రమేశ్, సేవ్వా జగదీశ్, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, కుమ్ర రాజు, బట్టు సతీశ్, మేస్తం పరమేశ్వర్, ఆపమ్ గంగయ్య, కనక రమణ, ఫిరంగి మల్లేశ్, ఆత్రం వెంకటేశ్, సిడం లక్ష్మణ్, రామ్‌చందర్, కుమ్ర జంగుబాపు, కుమ్ర మోతిరామ్, గెడం రాము, కొత్తపల్లి సంతోష్, కుమ్ర రాము, ఉగ్గే విఠల్ పాల్గొన్నారు.