తాండూర్ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఆదివాసీ గిరిజన యువకుల ( Tribal youths ) పై అటవీశాఖ అధికారులు దాడి చేయడం శోచనీయమని తుడుం దెబ్బ ( Tudum Debba ) నాయకులు అన్నారు.అటవీ అధికారుల దౌర్జన్యాలపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే జన్నారం అటవీ పరిధి అధికారి లక్ష్మీనారాయణను విధుల నుంచి తక్షణమే తొలగించాలని, అటవీ శాఖ అధికారి శాంతరాంను ఉమ్మడి జిల్లా నుంచి వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
మంగళవారం తాండూర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తుడుందెబ్బ తాండూర్ మండల అధ్యక్షుడు యాపల సమ్మయ్య, రాష్ట్ర కార్యదర్శి మండిగ రవీందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం మణికుమార్ మాట్లాడారు. ఆదివాసీల హక్కులను పరిరక్షించా ల్సిన అధికారులే వారిపైనే అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తే తుడుందెబ్బ ఆధ్వర్యంలో భారీ శాంతియుత నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈసమావేశంలో తుడుందెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుర్సెంగ బాబురావు, ప్రధాన కార్యదర్శి బుర్స ప్రవీణ్, విద్యార్థి సంఘం అధ్యక్షుడు పశుల ధర్మయ్య, కొలవార్ సేవా సంఘం మండల అధ్యక్షుడు గొల్లిశెట్టి బాపు, నాయక్ పోడ్ సేవా సంఘం మండల అధ్యక్షుడు జైనేని బాపు, టెకంజేష్, ఉరడి వెంకటేష్, సాయి ప్రమోద్, అనిల్, గోలేటి, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.