కుభీర్, అక్టోబర్ 6: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పల్సి గ్రామంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన థౌటి రాములు తన వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం అడవి జంతువు అడుగుల గుర్తులను గుర్తించాడు. పులి కావొచ్చని అతడికి అనుమానం రావడంతో వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. అటవీ శాఖ అధికారి శివప్రసాద్ తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని వ్యవసాయ క్షేత్రంలో కనిపించిన అడుగులను పరిశీలించారు. వాటి ఆకారం, పరిమాణంను పరిశీలించిన అనంతరం అవి చిరుత పులి అడుగులేనని నిర్ధారించారు.
చిరుత పులి సంచారం విషయం తెలియడంతో పల్సి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల రైతులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే రైతులు ఒంటరిగా వెళ్లకూడదని.. ముఖ్యంగా రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. చిరుత పులి కదలికలను గుర్తించేందుకు అటవీ శాఖ అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

గ్రామ పరిసరాల్లో అనుమానాస్పదంగా జంతువు కనిపించినా, అడుగుల గుర్తులు లేదా ఇతర ఆనవాళ్లు కనిపించినా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని వారు తెలిపారు. ప్రజలు భయాందోళనలకు గురవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. చిరుత సంచరిస్తున్నందున పంట పొలాలకు ఎవరూ ఒంటరిగా వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా అటవీ అధికారుల వెంట సూర్యవంశీ భోజరాం పటేల్, శివారు రైతులు ఉన్నారు.