మంచిర్యాల అర్బన్, జనవరి 4 : మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. శనివారం రామగుండం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో స్పెషల్ పార్టీ సి బ్బందికి గ్రేహౌండ్స్ తరహా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్ఎస్ఐ వెంకటేశ్ ఆధ్వర్యంలో సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆయనకు మహిళా కమాండోస్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. సీపీ మాట్లాడుతూ శరీరం దృఢంగా ఉన్నప్పుడే ఆలోచన శక్తి పెరుగుతుందన్నారు. గ్రేహౌండ్స్ సిబ్బంది వామపక్ష తీవ్రవాదాన్ని ఎదురొనేందుకు, నక్సలైట్ల ఏరివేతకు వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అన్ని విభాగాల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డులు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కోర్టు కానిస్టేబుళ్ల బాధ్యత కీలకమైనది
నేరస్తులకు శిక్షపడేందుకు కోర్టు కానిస్టేబుళ్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని సీపీ శ్రీనివాస్ అన్నారు. శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లు, లైసెన్ ఆఫీసర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని, షెడ్యూల్ ప్రకారం సాక్షులను కోర్టులో హాజరుపర్చాలని సూచించారు. పెండింగ్ కేసులను వెంటనే డిస్పోజల్ చేయాలని, నేరస్తులకు శిక్షలు పడితే నేరాలు తగ్గుముఖం పడతాయన్నారు. కోర్టులో బాధితులకు న్యాయం జరిగేలా, నేరస్తులకు శిక్షపడేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏసీపీ ప్రతాప్, సురేంద్ర, లీగల్ సెల్ ఇన్స్పెక్టర్ కృష్ణ, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సతీశ్ పాల్గొన్నారు.