రామకృష్ణాపూర్, ఏప్రిల్ 17 : ప్రపంచీకరణ నేపథ్యంలో మారుతున్న విద్యావ్యవస్థకనుగుణంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫిన్లాండ్ విద్యా విధానాన్ని రానున్న విద్యా సంవత్సరం నుంచి గ్రీన్వుడ్ పాఠశాలలో అమలు చేస్తామని ఆ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జీ భరద్వాజ నాయుడు తెలిపారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమ్మాగార్డెన్ ఏరియాలోని పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫిన్లాండ్ బృందం సభ్యులతో తల్లిదండ్రులకు ఓరియెంటేషన్ తరగతులు నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ భరద్వాజ నాయుడు మాట్లాడారు. ఫిన్నిష్ గ్లోబల్ ఎడ్యూకేషన్ సర్వీసెస్, గ్రీన్ వుడ్ పాఠశాల సంయుక్తంగా ఫిన్లాండ్ విద్యా విదానాన్ని 2026-27 సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. ఆర్టీఫిషియల్ ఇంటెలీజెన్స్ ద్వారా ఎన్నో ఉద్యోగాలు కోల్పోతున్నప్పటికీ, స్కిల్స్ ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. స్కిల్ లాబొరేటరీస్ను పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు కృత్యాధార బోధన ద్వారా మంచి విద్యను అందించేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.
అనంతరం ఫిన్నిష్ గ్లోబల్ ఎడ్యూకేషన్ సర్వీసెస్ అకాడమిక్ హెడ్ లారా మరియా మాటాడుతూ పిల్లలకు తగినంత స్వేచ్ఛనివ్వాలని, ఆ స్వేచ్ఛ దుర్వినియోగం కాకుండా చూడాలని కోరారు. తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం, విద్యార్థుల సమష్టి కృషితో గొప్ప విజయాలు సాధించవచ్చన్నారు. పాఠశాల యాజమాన్యం విశాలమైన తరగతి గదులు, ప్లేగ్రౌండ్తో మంచి సౌకర్యాలు కల్పించారని, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ రాజేశ్వరి, అకాడమిక్ అడ్వైజర్ డా. మాధురీ, ఎంజీఎం పవన్, ప్రిన్సిపాల్ చంద్రమోహన్, హెడ్ మిస్ట్రెస్ క్రిస్టినా, వైస్ ప్రిన్సిపాల్ తిరుపతి, ఏవో కుద్దూలు పాల్గొన్నారు.