బాసర, ఫిబ్రవరి, 17 : ఆర్జీయూకేటీ బాసర మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ ప్రొడక్ట్ డిజైన్, డెవల్మెంట్ అండ్ అడిటివ్ మ్యాన్‌ఫాక్చరింగ్ సంయుక్త ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన త్రీడీప్రింటింగ్, డిజైన్‌పై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం శుక్రవారం ముగిసినట్లు వీసీ వెంకటరమణ తెలిపారు బోధన, మూల్యాంకన పద్ధతుల్లో కొత్త భావనలపై అధ్యాపకులకు అవగాహన కల్పించామని పేర్కొన్నారు. జ్ఞానం, సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆధునిక సమాచారం, పరిశోధనా పద్ధతి సాధనాలను ఉపయోగించి జ్ఞానాన్ని పొందవచ్చని తెలిపారు. ఎఫ్డీపీ దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా మెకానికల్ విభాగ అధ్యాపకులను డైరెక్టర్ సతీశ్ కుమార్ అభినందించారు. కార్యక్రమంలో వివిధ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్స్ పాల్గొన్నారు.