తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి గద్దెనెక్కిన కేసీఆర్.. రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేశారు. 24 గంటల విద్యుత్. చెరువులు, ప్రాజెక్టుల పునరుద్ధరణతో పుష్కలంగా నీళ్లు. రైతుబంధు, సబ్సిడీ ఎరువులు, రైతు బీమా, కల్లాల నిర్మాణం, ముచ్చటకు రైతు వేదిక, ఇంటి ముందే కొనుగోలు కేంద్రాలు.. ఇలా ఒకటేమిటి.. లెక్కలేనన్ని సంక్షేమ పథకాలతో రైతన్నకు అండగా నిలిచారు. వెరసి దండుగ అన్న ఎవుసం పండుగైంది.
కరంటు సరిగా లేదు. నీళ్లు లేవు. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందలేదు. పెట్టుబడి పైసలు అసలే లేవు. అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నా రూపాయి ఇవ్వలేదు. కాస్తో కూస్తో దిగుబడి వచ్చినా కొనే నాథుడు లేడు. కుప్పలు తెప్పలుగా అప్పులు.. వెరసి రైతన్న తనువు చాలిస్తున్నాడు.
మంచిర్యాల, నవంబర్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పాలనలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. వర్షాలు.. వరదలకు పంటలు దెబ్బతిని.. ఆశించిన దిగుబడి రాక.. అప్పుల బాధలు భరించలేక.. ఇలా అనేక కారణాలతో బలవన్మరణాలు నిత్యకృత్యంగా మారాయి. ఒక్క ఈ నెల ప్రారంభంలోనే ఇప్పటికే ముగ్గురు తనువు చాలించగా, సర్కారు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో పండుగలా సాగిన వ్యవసాయం, ప్రస్తుత రేవంత్ సర్కారు పుణ్యమాని దండుగైపోయి రైతులు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి.
బీఆర్ఎస్ సర్కారు రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేయగా, రైతన్నలు రంది లేకుండా సాగు చేసుకొని ఆర్థికాభివృద్ధి వైపు సాధించారు. రైతుబంధు, రైతు బీమా కార్యక్రమాలు రైతన్నలకు కొండత ధైర్యాన్నిచ్చాయి. వర్షాలు-వరదలు మొదలైన ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఎకరాకు రూ.10 వేల నష్ట పరిహారం అందించి భరోసానిచ్చా రు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో పరిస్థితి పూర్తిగా మారింది. లక్షల ఎకరాలకు సా గునీళ్లు అందించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పడావు పె ట్టారు. సాగు నీరు ఇవ్వకుండా రైతులను గోస పెట్టా రు. రైతుభరోసా, రుణమాఫీ అందరికీ ఇవ్వకుండా నానా అవస్థలు పెట్టారు. యూరియా కోసం రోజుల తరబడి ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితికి తీసుకొచ్చా రు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ను సైతం కోత పెట్టారు. అసలే ప్రతికూల పరిస్థితులతో అల్లాడుతున్న రైతులను అకాల వర్షాలు మరింత దెబ్బతీశాయి. తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టాయి. వ్యవసాయ అధికారులు వచ్చి నష్టాన్ని అంచనా వేసి వెళ్లడం తప్ప.. ఇప్పటి దాకా రైతులకు రూపాయి పరిహారం ఇచ్చిం ది లేదు. కేసీఆర్ సర్కారులో సీజన్‌కు ముందే బ్యాం క్ ఖాతాల్లో పడిన రైతుబంధు డబ్బులు.. ఇప్పుడు (రైతు భరోసా) ఇవ్వడం లేదు. ఈ రెండేళ్లలో ఒక్కసారే రైతుభరోసా జమ చేశారు. అది కూడా రైతులందరికీ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో భూమినే నమ్ముకొని బతుకుతున్న రైతన్నలు క్షేత్రస్థాయిలో తీ వ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అప్పు తెచ్చి పంటలు సాగు చేస్తే సరైన దిగుబడి రాక.. ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్న పంటలను చూడలేక.. అప్పులు తీర్చే దారి లేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే ఆత్మహత్యలు చేసుకున్న రై తు కుటుంబాలను సర్కారు పట్టించుకోకపోవడం గ మనార్హం. గతంలో గుంట భూమి ఉన్న రైతు మరణిస్తే వారం, పది రోజుల్లోనే రూ.5 లక్షలను సంబంధిత సభ్యుల ఖాతాల్లో జమ చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. సర్కారు సాయం కోసం బాధిత కుటుంబాలు ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. కాంగ్రె స్ అధికారంలోకి వచ్చాక ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను బీఆర్ఎస్ నాయకులు వచ్చి పరామర్శించారు. పార్టీ తరుఫున రూ.లక్ష సాయమందించారు. బీఆర్ఎస్ పరామర్శ చేశాక.. సదరు రైతులకు బీమా పైసలు పడ్డాయి. కానీ, సర్కారు తనకై తాను వేయలేదు. ఇప్పటికీ జిల్లాలో మరణించిన రైతు కుటుంబాలు బీమా డబ్బులు ఎప్పుడిస్తారా అని ఎదరు చూస్తున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంట దిగుబడులు సరిగా రాలేదని ముగ్గురు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ) మండ లం చింతకుంట గ్రామానికి చెందిన పిట్టల దుర్గయ్య (64) పంట దిగుబడి రాలేదని మనస్తాపం చెంది పురుగుల మందు తాగి నవంబర్ 1న ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజే 2న వాంకిడి మండల కేంద్రానికి చెందిన రైతు బుట్ల సుధాకర్(34) అనే రైతు వర్షాల కారణంగా పత్తి పంట దెబ్బతిన్నదని పురుగుల మందు తాగాడు. వాంకిడి ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా, మార్గంమధ్యలోనే ప్రాణాలు వదిలాడు. ఇక 3న ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రానికి చెందిన కుమ్మరి ప్రేమేందర్ (41) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రైవేట్ వ్యక్తులు, బ్యాంకుల్లో దాదాపు రూ.5 లక్షల దాకా అప్పు తెచ్చి 6 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. అధిక వర్షాలతో పంట పూత, కాత లేక దిగుబడిపై ఆశలు సన్నగిల్లాయి. దీంతో మనస్తాపం చెందిన ఆయన పురుగుల మందు తాగాడు. రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఈ రైతుల విషయంలోనైనా ఆలస్యం చేయకుండా సర్కారు రైతు బీమా సాయం సరైన సమయానికి అందిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.
ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం గూడకు చెందిన రైతు కర్ల నారాయణ (68) అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయనకు భార్య, కొడుకు రవీందర్-కోడలు సూజాతతో పాటు వివాహమైన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 3.13 ఎకరాల సొంత భూమి ఉండగా, మరో 15 ఎకరాలు కౌలు తీసుకొని వ్యవసాయం చేశాడు. పత్తి, సోయాబీన్, కంది పంటలు వేశాడు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో రూ. 2 లక్షల పంట రుణంతో పాటు రూ. 4 లక్షల్ర ప్రైవేట్ అప్పులు, రూ.1,60 లక్షల కౌలు పైసలు చెల్లించాల్సి ఉంది. జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం రూ.7.50 లక్షల అప్పు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.