బజార్ హత్నూర్: పంట కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదంటూ బజార్ హత్నూర్‌లో (Bajarhathnoor) రైతులు ఆందోళన చేపట్టారు. వానాకాలం పంటకు విత్తనాలు కొందామన్నా తమవద్ద పైసలు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భరోసా నగదును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
జొన్న పంట కొనుగోలు చేసిన ప్రభుత్వం నెలలు గడుస్తున్నా ఇప్పటీకి డబ్బులు చెల్లించలేదని బజార్హత్నూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నాకు దిగారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ జొన్నలను కొనుగోలు చేసిన ప్రభుత్వం ఇన్ని రోజులు గడుస్తున్నా డబ్బులు చెల్లించడం లేదన్నారు. కనీసం ఖరీఫ్‌లో విత్తనాలు, ఎరువులు కొనడానికి కూడా చేతిలో చిల్లి గవ్వ లేక వ్యాపారుల వద్ద చేయి చాపాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందరు.
ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి రైతు భరోసా రూ.15 వేలు ఇస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. తక్షణమే రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అన్నం పెట్టే రైతులను మోసం చేస్తే బాగుపడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ స్రవంతికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు డబ్బుల చంద్ర శేఖర్, చట్ల వినీల్, సాయన్న, విలాస్, శ్రీనివాస్, రవి, శంకర్, తదితరులు పాల్గొన్నారు.