కౌటాల, డిసెంబర్ 19 : గుండాయిపేటలోని మిర్చితోటలో గురువారం పెద్దపులి కనిపించడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. గ్రామంలోకి పరుగులు తీసి గ్రామస్తులు, అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు. కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో వినయ్‌కుమార్ సాహు పులి సంచరించిన ప్రదేశానికి వెళ్లి దాని అడుగులను గుర్తించి నిర్ధారించారు. ఆయన మాట్లాడుతూ కాగజ్‌నగర్ కారిడార్ పులుల ఆవాసానికి అనుకూలంగా ఉండడంతో మహారాష్ట్ర నుంచి పులులు రాకపోకలు సాగిస్తున్నాయన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని సూచించారు. ఆయన వెంట ఎఫ్ఆర్వో ఎక్బాల్ హుస్సేన్, ఎఫ్ఎస్వో, ఎఫ్‌బీవో, యానిమల్ ట్రాకర్స్ ఉన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
హాజీపూర్, డిసెంబర్19 : హాజీపూర్ మండలం పాతమంచిర్యాల, ముల్కల్ల అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ రేంజ్ ఆఫీసర్ సుభాష్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పుశువుల కాపరులు అటవీ ప్రాంతానికి వెళ్లకూడదని, పంట చేలల్లో ఎలాంటి విద్యుత్ వైర్లు అమర్చకూడదని పేర్కొన్నారు.