రైతులపై ఎరువుల పిడుగు
యాసంగి సీజన్ ముగిసి, వానకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులపై ఎరువుల కంపెనీలు మరోసారి భారం మోపాయి. ఓ వైపు అకాల వర్షాలు, మరోవైపు ప్రభుత్వం యాసంగి పంటలను సక్రమంగా కొనుగోళ్లు జరపకపోవడంతో ఇప్పటికే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి కష్టాల నుంచి బయటపడి వానకాలం సాగుపై ఆశలు పెట్టుకున్న అన్నదాతకు ఎరువుల ధరువు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
- బస్తాకు రూ.150 నుంచి రూ.400 పెంపు
- ధరల పెరుగుదలతో తప్పని తిప్పలు
- ఇప్పటికే వేధిస్తున్న యూరియా కొరత
- ధరల పెంపుపై మండిపడుతున్న రైతులు
నిర్మల్, మే 17(నమస్తే తెలంగాణ) : యాసంగి సీజన్ ముగిసి, వానకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులపై ఎరువుల కంపెనీలు మరోసారి భారం మోపాయి. ఓ వైపు అకాల వర్షాలు, మరోవైపు ప్రభుత్వం యాసంగి పంటలను సక్రమంగా కొనుగోళ్లు జరపకపోవడంతో ఇప్పటికే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి కష్టాల నుంచి బయటపడి వానకాలం సాగుపై ఆశలు పెట్టుకున్న అన్నదాతకు ఎరువుల ధరువు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
గత వానకాలం సీజన్ నుంచి ఇప్పటివరకు అంటే ఏడాది కాలంలో కాంప్లెక్స్ ఎరువుల ధరలను ఆయా కంపెనీలు ఏకంగా నాలుగు సార్లు పెంచాయి. తొలకరి చినుకులు కురిసే నాటికి అవసరమైన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేద్దామనుకుంటున్న రైతులకు పెరిగిన ధరలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆయా ఎరువుల కంపెనీలు పెరిగిన ధరలపై ఇప్పటికే డీలర్లకు సమాచారం అందించాయి. వివిధ రకాల ఎరువులను బట్టి ఒక్కో బస్తాపై రూ.150 నుంచి రూ.400 వరకు పెరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా, డీఏపీ తర్వాత రైతులు ఎక్కువగా కాంప్లెక్స్ ఎరువులను వినియోగిస్తారు. కాంప్లెక్స్ ఎరువులతోపాటు, పొటాష్ ధరలు గణనీయంగా పెరగడంతో వచ్చే వానకాలం సీజన్ నుంచి రైతులపై పెట్టుబడి ఖర్చుల భారం అధికం కానున్నది.
76 వేల ఎంటీఎస్ ఎరువుల వినియోగం
వచ్చే వానకాలం సీజన్లో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 4.35 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో పత్తి 1.50 లక్షల ఎకరాలు, వరి 1.20 లక్షల ఎకరాలు, సోయాబీన్ లక్ష ఎకరాలు, మక్క 35 వేలు, పసుపు 15 వేలు, కందులు 10 వేలు, మినుములు, పెసర్లు, ఇతర పంటలు 5 వేల ఎకరాల్లో సాగవుతాయని సాగు ప్రణాళికలో పేర్కొన్నారు. అయితే ఆయా పంటల సాగుకు అన్ని రకాల ఎరువులు కలుపుకొని మొత్తం 76 వేల మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు.
ఇందులో యూరియా 34 వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 14వేల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 20వేలు, పొటాష్ 8వేల మెట్రిక్ టన్నులు ఉన్నాయి. ఒకవైపు యూరియా కష్టాలు, మరోవైపు అడ్డగోలుగా పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలతో వచ్చే వానకాలం సాగు రైతులకు కత్తిమీద సాములా మారనున్నది. ఫర్టిలైజర్ కంపెనీలు ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ పోతున్న ఎరువుల ధరలపై ప్రభుత్వాల నియంత్రణ లేకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.
ధరలు పెంచడం దారుణం
రెండేళ్లుగా రైతులకు సక్రమంగా యూరియా దొరకడం లేదు. అధికారులను అడిగితే యాప్‌లో బుక్ చేసుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నరు. డీలర్ల వద్ద అందుబాటులో లేని యూరియా యాప్‌లో ఎక్కడి నుంచి దొరుకుతది. రైతులను మోసం చేసేందుకే ఈ యాప్ బుకింగ్ పద్ధతిని తీసుకొచ్చారు. రైతులకు ఇదే అతిపెద్ద సమస్య ఉండగా, కాంప్లెక్స్ ఎరువుల ధరలు విపరీతంగా పెంచిన్రు. యాసంగి వడ్లు సక్రమంగా కొనుగోలు చేయడం లేదు. కల్లాల్లో తడుస్తున్నయ్. మక్కలు తీసుకుంటలేరు.
మా దిలావర్పూర్ మండలంలో అయితే ఇప్పటి వరకు జొన్నల కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేదు. ఎక్కడ చూసినా రోడ్లపై జొన్నల కుప్పలు పేరుకుపోయినయ్. పంటలను అమ్ముకొనేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నరు. సాగులో రైతులు అధికంగా వినియోగించే 20-20-13 రకం ఎరువు ధరను బస్తాకు ఏకంగా రూ.400 పైగా పెంచేశారు. పొటాష్తోపాటు ఇతర అన్ని రకాల ఎరువుల ధరలను 25 శాతానికి పైగా పెంచారు. ఇంత భారీ మొత్తంలో ఎరువుల ధరలు ఒకేసారి పెంచడం దారుణం. మద్దతు ధర పెంచకుండా, ఎరువుల ధరలు విపరీతంగా పెంచేస్తున్నారు.
ఇప్పటికే వ్యవసాయ కూలీల ధరలు పెరిగిపోయినయ్. దుక్కులు దున్నేందుకు ట్రాక్టర్ల అద్దె పెరిగింది. నిన్న, మొన్నటి వరకు గంటకు రూ.1000 నుంచి రూ.1200 ఉన్న ధర ఇప్పుడు రూ.1500 నుంచి రూ.1800 అయ్యింది. కోతల సమయంలో హార్వెస్టర్ ధరలు పెరిగాయి. గంటకు రూ.1800 ఉన్న ధరను రూ.2500లకు పెంచారు. డీజిల్, ఆయిల్తోపాటు మేయింటెనెన్స్ ధరలు పెరగడంతోనే ట్రాక్టర్, హార్వెస్టర్ అద్దె ధరలను పెంచాల్సి వచ్చిందని నిర్వాహకులు అంటున్నరు. ఇన్ని రకాలుగా ధరలు పెరిగిన తర్వాత రైతులు వ్యవసాయం చేయాల్నా? వద్దా? అనే పరిస్థితి దాపురించింది. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు కూడా ధరలను నియంత్రించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా పెంచిన ఎరువుల ధరలను తగ్గించి రైతులను ఆదుకోవాలి.
– ఎలాల చిన్నారెడ్డి, రైతు, బీఆర్ఎస్ మాజీ మండల కన్వీనర్, దిలావర్పూర్
భారం పడకుండా చూడాలి..
ఎరువుల ధరలు పెరిగాయని ఫర్టిలైజర్ దుకాణ నిర్వాహకులు చెబుతున్నరు. ఇప్పటికే యాసంగి పంటలను అమ్ముకొనేందుకు అష్టకష్టాలు పడ్డం. మళ్లీ ఎరువుల ధరలు పెరిగితే పెట్టుబడి ఖర్చులు తడిసి మోపెడైతయ్. అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా ఎరువుల ధరలు పెరిగినట్లు డీలర్లు అంటున్నరు. ప్రతి పంటకు కాంప్లెక్స్ ఎరువుల వినియోగం అధికంగా ఉంటుంది. మక్క, వరి, పసుపు తదితర ప్రధాన పంటలకు అడుగు మందుగా 20-20 ఎరువులను తప్పకుండా వేయాలి. వీటి ధరను బస్తాకు రూ.400 పెంచడంతో రైతులపై తీవ్ర భారం పడుతుంది. అలాగే ఆయా పంటల దిగుబడి అధికంగా రావాలంటే పొటాష్తోపాటు ఇతర ఎరువులను అధికంగా వినయోగించాలి. పొటాష్ ధరలు కూడా బాగా పెరిగాయి. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వెంటనే పెరిగిన ధరలను తగ్గించి, రైతులపై భారం పడకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
– మగ్గిడి శ్రీనివాస్‌రెడ్డి, రైతు, సిద్దులకుంట

Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

