కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 15(నమస్తే తెలంగాణ): తమ భూములను కొంత మంది దళారులతో కలిసి లాక్కునేందుకు సింగరేణి యజమాన్యం కుట్ర చేస్తున్నదని ఆరోపిస్తూ గోలేటి గ్రామానికి చెందిన రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గోలేటి ఓపెన్‌కాస్ట్ ఏర్పాటు సమయంలో నిర్వాసితులైన 28 మంది రైతులకు సర్వే నంబర్ 199/1లో 1976లోనే 58.09 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు హక్కు పత్రాలు ఇచ్చారని, వాటిని నమ్ముకొని పట్టాలు చేయించుకోలేదని రైతులు తెలిపారు.
ఇటీవల గోలేటి ఓపెన్ కాస్ట్ విస్తరణలో భాగంగా భూ సేకరణ కోసం 2024 జనవరి 1న అభిప్రాయ సేకరణ చేపట్టగా రెవెన్యూ అధికారులు తమను పిలువలేదని తెలిపారు. తమకు తెలియకుండా కొంత మంది రాజకీయ అండదండలు ఉన్నవారు ఇప్పటికే అక్రమంగా పట్టాలు కూడా చేసుకున్నారని ఆరోపించారు. 1976 నుంచి సాగులో ఉన్న రైతుల సమక్షంలో విచారణ చేపట్టాలని, తాము జీవనాధారమైన భూములకు ఇచ్చే రివార్డుపై కూడా అధికారులు స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతూ సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.
వట్టివాగు ప్రాజెక్టు నిర్మాణంలో తిర్యాణి మండలంలోని దేవాయిగూడా ఇళ్లను కోల్పోయిన వారికి 2000 సంవత్సరంలో నష్టపరిహారంగా ఒక్కొక్కరికీ 4 గంటల ఇంటి స్థలాన్ని ఆసిఫాబాద్ మండలంలోని అప్పపల్లిలో కేటాయిస్తూ పునరావాసాన్ని కల్పించారు. వాటికి ఇప్పటివరకు పట్టాలివ్వలేదని, కోరుతూ సోమవారం నిర్వాసితులు కలెక్టర్‌కు విన్నవించారు.