నిర్మల్ జిల్లాలోని కలెక్టరేట్, సారంగాపూర్, తాంసి మండలాల్లో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని, లారీలు, హమాలీలు, గన్నీ బ్యాగుల కొరత తీర్చాలని నినదించారు. రైతులే గన్నీ బ్యాగులు, హమాలీ చార్జీలు, లారీల కిరాయి చెల్లిస్తే ప్రభుత్వం, అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి, ఈదురుగాలుల బీభత్సానికి పంటలు తడిసిపోతున్నాయని, తడిసిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల హామీతో ఆందోళనలు విరమించారు.
– సారంగాపూర్/నిర్మల్ చైన్‌గేట్/తాంసి,మే 26
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ గ్రామంలో మంగళవారం రైతులు స్వర్ణ-నిర్మల్ రహదారిపై రెండు గంటలపాటు ధర్నా చేపట్టారు. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచి, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ధర్నా విషయం తెలియడంతో ఎస్ఐ శ్రీకాంత్ అక్కడి చేరుకొని రైతులకు నచ్చజెప్పిన వినలేదు. చివరికి తహసీల్దార్ విజయకాంత్రావుకు సమాచారం అందించడంతో ధర్నా వద్దకు చేరుకున్నాడు. లారీల కొరత, కొనుగోళ్లు సక్రమంగా జరిగేటట్లు చూస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు.
మొక్కజొన్న, జొన్న, ధాన్యం పంట ఉత్పత్తులు ఒకేసారి కొనుగోలు కేంద్రానికి రావడంతో చాలా ఇబ్బంది ఉందన్నారు. సెంటర్ మొత్తానికి ఐదుగురే హమాలీలు ఉండడంతో పంటలు కొనుగోలు చేయడం కష్టంగా ఉందన్నారు. కేంద్రంలో పంట ఉత్పత్తులు పోసి నెలరోజులకు పైగా కావస్తున్నా.. కొనుగోలు చేసిన పంటలను మిల్లులకు తరలించాలంటే లారీల కొరత తీవ్రంగా ఉందన్నారు. లారీ డ్రైవర్ల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందన్నారు. రైతులు బస్తాకు రూ.60 చెల్లిస్తేనే మిల్లులకు తరలిస్తున్నారని, అక్కడ కూడా తరుగు పేరిట నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు.
గన్నీ బ్యాగుల కొరత మూలంగా ప్రైవేట్ వ్యక్తుల వద్ద రైతులు ఒక సంచి రూ.28లకు కొనుగోలు చేసి పంటలను నింపుకుంటున్నారన్నారు. సెంటర్‌కు ఇప్పటి వరకు ఒకే లారీ వచ్చిందని, లారీల కొరత మూలంగా పంటలు కేంద్రాల్లోనే ఉండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు గన్నీ బ్యాగులు, హమాలీ చార్జీలు, లారీల కిరాయి చెల్లిస్తే ప్రభుత్వం, అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి, ఈదురుగాలుల బీభత్సానికి పంటలు తడిసిపోతున్నాయని, తడిసిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు.
నిర్మల్ జిల్లాలోని వెల్మల్ గ్రామానికి చెందిన రైతులు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. కేంద్రంలో 30 లారీల వరకు ధాన్యం ఉన్నా తరలించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ రెవెన్యూ అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ లారీలు పంపిస్తామని తెలపడంతో ఆందోళన విరమించారు.
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో జొన్న కొనుగోలు సక్రమంగా జరగడం లేదని రైతులు ఆందోళన బాట పట్టారు. రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 21 రోజులు గడిచినా.. ఇప్పటికీ పూర్తి స్థాయిలో కొనుగోలు జరగలేదు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సమస్యను పరిషరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.