నిర్మల్, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ) : వద్దంటే వానలు కురుస్తుండడంతో చేతికొచ్చే దశలో పంటలు దెబ్బతింటున్నాయి. దీంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోతున్నది. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలు పత్తి, సోయా పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పత్తి ప్రస్తుతం పూత, పిందె దశలో.. సోయా పూత, కాత దశలో ఉన్నాయి. ఈ సమయంలో వరుసగా వర్షాలు కురుస్తుండడంతో పూత, పిందె రాలిపోతున్నది. దీనికితోడు చేలలో వాన నీరు నిలుస్తుండడంతో మొక్కలు ఎర్రబారి తెగుళ్లు సోకుతున్నాయి. దాదాపు అన్ని పంటల పరిస్థితి ఇలాగే ఉన్నది. దీంతో ఈసారి దిగుబడి తగ్గడమే కాకుండా కనీసం పెట్టిన పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
నిర్మల్ జిల్లావ్యాప్తంగా ఈ వానకాలంలో 1,40,497 ఎకరాల్లో పత్తి సాగైంది. గత ఆగస్టులో కురిసిన అతి భారీ వర్షాలకు 3,840 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. వాస్తవానికి 10 వేల ఎకరాలకు పైగా పత్తికి నష్టం వాటిల్లినట్టు రైతులు చెబుతున్నారు. ఆగస్టులో కురిసిన వర్షాలు వరదలతో పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లగా, ఆ తర్వాత కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాల వల్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో చాలా చోట్ల పత్తి, సోయా మొక్కలకు నీరెత్తి (జౌకుపట్టి) ఎర్రబారుతున్నయి. ఎరువులు వేసి కలుపు తీసేందుకు కూడా తెరిపినివ్వక పోవడంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు.
సోయా ప్రస్తుతం కాత దశలో ఉండగా, పంట ఎర్రబారి కాత రాలిపోతున్నదని రైతులు వాపోతున్నారు. తాజాగా మంగళవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 18.6 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా, నిర్మల్ మండలంలో అత్యధికంగా 78.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాబోయే రెండు, మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. నాటి నుంచి నేటి వరకు వరుసగా కురుస్తున్న వర్షాలతో చాలా చోట్ల పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయని, ఆయా పంటలను కూడా సర్వే చేసి నష్టం అంచనాను రూపొందించి పరిహారం అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గత నెల రోజులుగా భారీ వర్షాలు కురియడంతో చాలా చోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. ఇప్పటికే పంట నష్టం వివరా లను ప్రభుత్వానికి నివేదిం చాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎర్రబారిన పత్తి, సోయా పంటలను కాపాడుకునేందుకు రైతులు సమీపంలో ఉన్న వ్యవసాయాధికారులు ఇచ్చే సూచనలు పాటించాలి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పంటల పరిస్థితి ఉన్నది. ద్రవ రూపంలో ఉన్న డీఏపీని చల్లితే పూత, పిందెలను కాపాడు కోవచ్చు. అలాగే శిలీంద్రనాశిని ద్రవాన్ని కూడా చల్లితే దిగుబడి పెరిగే అవకాశం ఉంది.
– అంజి ప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి (నిర్మల్)
నాకున్న పదెకరాల్లో పత్తి వేసిన. 20 రోజుల సంది వర్షాలు పడడంతో పంటకు తెగుళ్ల రోగం వచ్చింది. పత్తి మొక్కలు ఎర్రబడుతున్నయ్. మడుల్లో వర్షం నీరు నిలిచి పూత రాలిపోతున్నది. అక్కడక్కడ ఉన్న కొన్ని పిందెలు కూడా రాలిపోతున్నయ్. ఎకరానికి రూ.25 వేలకు పైగా పెట్టుబడి పెట్టిన. ఈసారి పెట్టుబడి కూడా వచ్చేటట్లు లేదు. ప్రభుత్వమే నష్ట పరిహారాన్ని ఇచ్చి ఆదుకోవాలి.
– కాంతారావు, రైతు, వెంకూర్ (కుంటాల మండలం)