జైపూర్, జనవరి 9 : ఇందారం ఓపెన్‌కాస్టు గని నుంచి ఓబీ మట్టిని తరలిస్తున్న వాహనాలను గురువారం రామారావుపేట గ్రామానికి చెందిన రైతులు అడ్డుకున్నారు. రామారావుపేట గ్రామం నుంచి గోదావరికి వెళ్లే వందల ఏళ్లనాటి రహదారిని మట్టిపోసి మూసివేశారని, ఓబీ తరలిస్తున్న రోడ్డుకు అడ్డంగా ఉంటే ఫ్లై ఓవర్ వేసుకొని మట్టిని తరలించుకోవాలని ఆందోళనకు దిగారు.
సింగరేణి అధికారుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని రోడ్డుకు అడ్డుగా పోసిన మట్టిని తొలగించడంతో వారు శాంతించారు. రైతులకు శాశ్వత పరిష్కారం చూపాకే రోడ్డును మూసి వేయాలని, లేదంటే ఆందోళనలు తప్పవని రైతులు హెచ్చరించారు. ఇక్కడ నిర్మిస్తున్న ఓ రైస్‌మిల్‌కు అనుకూలంగా రూ. 95 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించేందుకు సింగరేణి అధికారులు టెండర్లు పిలిచారని, ఆ రోడ్డును వెంటనే రద్దు చేసి గ్రామం నుంచి గోదావరికి వెళ్లే రోడ్డును బాగు చేసేందుకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు గోలి రాములు, వెంకటేశ్, కుమ్మరికుంట కుమార్, అరికె సంతోష్ తదితరులు పాల్గొన్నారు.