“మేమంతా ఉపాధి పనులు చేసుకునేటోళ్లం. పక్కనున్న ఊరికి ఎవుసం పనులకు కూడా పోతం. మా అభిప్రాయం తీసుకోకుండానే ఊరిని కార్పొరేషన్లో కలిపేసిన్రు. ఇకనుంచి ఉపాధి పథకం ఉండదంటున్నరు. ఇగ ఏం పనులు చేసుకొని బతకమంటారో చెప్పండి. రేపొచ్చి ఇంటి, నల్లా పన్నులు కట్టమంటే ఎక్కడికి పొమ్మంటరు. గిందుకేనా మిమ్ముల ఓట్లేసి గెలిపించింది. ఇకనైనా మా బాధను పట్టించుకోవాలె. మాకు కార్పొరేషన్ వద్దే వద్దు.. గ్రామ పంచాయతీయే కావాలి’ అంటూ గుడిపేటకు చెందిన మహిళలు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఇటీవల నర్సింగాపూర్ గ్రామంలోనూ ఇదే తరహా నిరసన చేపట్టిన విషయం విదితమే.
మంచిర్యాల, జనవరి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ జీవోలు తీసుకురావడంపై జిల్లా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మొన్నటికి మొన్న ఇండస్ట్రియల్ హబ్ పేరిట దళిత రైతులను బెదిరించి భూములు గుంజుకునేందుకు సంతకాల సేకరణ చేపట్టగా, ఈ విషయం కాస్త బయటికి రావడంతో మరోసారి రైతులందరినీ పిలిపించి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ వివాదం కొనసాగుతూనే ఉండగా, మరోవైపు మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తూ నస్పూర్ మున్సిపాలిటీ, హజీపూర్ మండలంలోని పోచంపాడ్, గుడిపేట, నర్సింగాపూర్, నంనూర్, చందనాపూర్, ముల్కల, కొత్తపల్లి, వేంపల్లి పంచాయతీలను అందులో విలీనం చేశారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది.
పది రోజుల క్రితం నర్సింగాపూర్ గ్రామస్తులు మా ఊరును కార్పొరేషన్లో కలపొద్దంటూ జాతీయ రహదారి-63పై బైఠాయించి రాస్తారోకో చేశారు. ప్రజాపాలన గ్రామసభలోనూ ఈ విషయమై అధికారులను నిలదీశారు. తాజాగా.. శుక్రవారం గుడిపేట గ్రామంలోని మహిళలు, ఉపాధి హామీ కూలీలు పంచాయతీ కార్యాలయానికి వచ్చి మా గ్రామాన్ని కార్పొరేషన్లో కలపొద్దంటూ నిరసనకు దిగారు. దీంతో ఈ వ్యవహారం కాస్త ఇప్పడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
హజీపూర్ మండలంలోని ఎనిమిది గ్రామాలు కార్పొరేషన్లో కలుస్తున్నాయి. దీంతో ఈ గ్రామాల్లోని ఉపాధి హామీ కూలీలు ఆ పథకానికి దూరం కానున్నారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ, ఏడాదికోసారి వంద రోజుల పని చేసుకునేకూలీలకు ఇకపై ఆ పనులు ఉండవని తెలిసి ఆందోళన చెందుతున్నారు. పట్టణ ప్రాంతంలో పూడికతీతలు, కందకాల తవ్వకం, చెట్లు నాటేందుకు గుంతలు తీయడం, ఇంకుడు గుంతలు, నీటి కుంటల నిర్మాణం ఇలాంటి పనులు అవసరముండదు. అందుకని ఉపాధి హామీని గ్రామీణ ప్రాంతాలకే వర్తింప చేస్తున్నారు. పట్టణ ప్రాంతాలకు దాన్ని విస్తరించాలనే నివేదికలు ఎప్పటి నుంచో ఉన్నా.. అది సాధ్యం కావడం లేదు. ప్రస్తుతం మంచిర్యాల మున్సిపాలిటీలోనూ ఉపాధి హామీ పథకం వర్తించడం లేదు.
ఇదే తరహాలో ఇప్పుడు కార్పొరేషన్లో తమ గ్రామాలు విలీనమైతే 100 రోజుల పని కూడా ఉండదనే అంశంపై జనాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. గుడిపేటలో 352, ముల్కల్లలో 299, వేంపల్లిలో 350, నర్సింగాపూర్‌లో 253, నంనూర్‌లో 156 మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. వీరందరికీ ఇప్పుడు వంద రోజుల పని కూడా లేకుండా పోతుందనే భయం వెంటాడుతున్నది. పైగా కార్పొరేషన్లో కలిపితే ప్రస్తుతం సర్కార్ ప్రకటించిన ఆత్మీయ భరోసా పథకం వర్తిస్తుందా.. లేదా.. అన్న విషయంపైనా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై అధికారుల నుంచి సైతం ఎలాంటి స్పష్టత రావడం లేదు. ఉపాధి కోల్పోవడంతో పాలు కార్పొరేషన్‌తో పన్నుల చెల్లింపు భారం పడుతుందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
గతంలో మా ఊరిలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మించారని, మా భూములన్నీ ప్రాజెక్టులో కోల్పోయామని గుడిపేట వాసులు చెబుతున్నారు. ఆ ప్రాజెక్టుతో మాకు వచ్చిందేమీ లేదని, మా గ్రామంలో మెడికల్ కాలేజీ కడుతున్నారని, అందులోనూ మాకు ఉపాధి లేదని, అసలు ఉంటుందో లేదో కూడా తెలియదని వాపోతున్నారు. పక్కనున్న గ్రామాలకు వెళ్లి వ్యవసాయ పనులు చేస్తూ, ఉపాధి హామీ పనులు చేస్తూ బతుకుతున్నామంటున్నారు. ఇప్పుడు కార్పొరేషన్లో కలిపితే బతికేదెట్లా అన్ని ప్రశ్నిస్తున్నారు.
ఇంటి పన్ను, నల్లా పన్ను, చెత్త పన్ను ఇన్ని పన్నులు కట్టేందుకు మాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని మండిపడుతున్నారు. వ్యవసాయ పనులతో పాటు ఉపాధి పనులు చేసుకునే తమను ఇబ్బందులు పెట్దొందంటూ వేడుకుంటున్నారు. మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా, మా అభిప్రాయం తీసుకోకుండా మా ఊరును కార్పొరేషన్లో కలిపే అధికారం ఎక్కడిదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా తమ గ్రామాన్ని కార్పొరేషన్లో కలపొద్దని కోరుతున్నారు.
మాకు కార్పొరేషన్ వద్దు. మాకు భూములు, జాగలు ఏం లేవు. మేం కైకిలి చేసుకునేటోళ్లం. మా ఊరిలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పడ్డది.. దానితో మాకు ఎలాంటి ఉపాధి లేదు. ఇప్పుడు మెడికల్ కాలేజీ పడ్డది. దానితోనూ మాకు పనులు లేవు. ఇప్పుడు కార్పొరేషన్ అయ్యాక మాకు పనులు ఉంటాయనే నమ్మకం లేదు. ఓట్లప్పుడు ఇళ్లచుట్టూ తిరిగారు. ఇప్పుడు మా సమస్య గురించి ఎవరూ అడగడం లేదు. మాకు ఏ దిక్కూ లేదు. కార్పొరేషన్లో మా ఊరిని కలిపితే పన్నులు ఎట్లా కడుతాం. ఉన్న ఉపాధి పని కూడా పోయేలా ఉంది. అందుకే రాజకీయ నాయకులు దిగిరావాలి. మాకు న్యాయం చేయాలి.
– డోకె స్వరూప, గుడిపేట
మా ఊరిని కార్పొరేషన్లో కలపడం వద్దు. మేం ఆరవై, డబ్బై మంది ఉపాధి కూలీలం ఉన్నాం. ఈ రోజు ర్యాలీగా గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చాం. మాకు ఎలాంటి భూములు, జాగలు లేవు. కూలీ చేసుకునేటోళ్లం. మా ఆయన చేపలు పట్టి గుడిపేటలో అమ్ముతాడు. నేను ఉపాధి పనికి పోత. ఇద్దరం కలిసి పనిచేస్తేనే కుటుంబం గడుస్తుంది. కార్పొరేషన్ అయితే గుడిపేట ఫిష్ మార్కెట్ కూడా మంచిర్యాలకు పోవాలి అంటున్నారు. అట్లా అయితే మా ఆయన ఫిష్ మార్కెట్‌కు పోవాల్సి వస్తుంది. నా 100 రోజుల పనిపోతుంది. ఇలా అయితే మేము ఎట్లా బతకడం. ఓట్లేసి గెలిపించినందుకు ఇలా గోస పెడుతరు అనుకోలే.
– డోకె సంధ్యారాణి, గుడిపేట
మా గ్రామాన్ని కార్పొరేషన్ చేస్తున్నారు. ఇది వరకే ప్రాజెక్ట్ పడి మా భూములన్నీ ముంపులో పోయాయి. మాకు ఇప్పుడు భూములు లేవు. మేమందరం కూలీ పనులు చేసుకునేటోళ్లమే. అక్కడ భూములున్నప్పుడు పోయి కూలీ పనులు చేసుకొని బతికినం. ఇప్పుడు అవి లేవు. మా ఆయన ఆటో నడుపుతడు. ఫ్రీ బస్సుతో గిరాకీలు లేకుంట అయినయి. ఇప్పుడు నేను చేసే ఉపాధి పనులు కూడా తీసేస్తే మేం ఎట్లా బతుకుతాం. కార్పొరేషన్ కలిపి ఇంటి పన్నులు, నల్ల పన్నులు, చెత్త బిల్లులు కట్టాలంటే ఎట్లా..
– సంగం సరిత, గుడిపేట