జైనథ్, మే 21 : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కంట గ్రామం-చందా గ్రామానికి వెళ్లే రహదారి సమీప ప్రాంతాల్లో ఎరువుల నిల్వ, విక్రయాలపై దాడులు నిర్వహించి నకిలీ ఎరువులను స్వాధీనం చేసుకున్నట్లు జైనథ్ సీఐ శ్రావణ్ తెలిపారు. సీఐ వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలానికి చెందిన ఎపురి కృష్ణయ్య తన స్నేహితుడు జైనథ్ మండలంలోని కంట గ్రామానికి చెందిన బట్ట మహేందర్‌తో కలిసి ఎరువుల వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
నల్గొండ జిల్లాలో ఎరువుల విక్రయాలకు లైసెన్స్ ఉన్నప్పటికీ ఆదిలాబాద్ జిల్లాలో అనుమతి లేకుండానే ఎరువులను విక్రయిస్తున్నట్లు తెలిపారు. అధిక లాభాల కోసం నకిలీ ఎరువులను తీసుకొచ్చి జైనథ్ మండలంలోని రైతులే లక్ష్యంగా చేసుకొని రెండు నెలలుగా విక్రయాలు చేస్తున్నట్లు తెలిపాడు. మారెట్ ధర కంటే తకువకు విక్రయిస్తూ ఒకో బ్యాగ్‌కు రూ.1000 నుంచి రూ.1200 వరకు వసూలు చేసినట్లు, ఇప్పటి వరకు సుమారు 400 బ్యాగులు విక్రయించినట్లు విచారణలో వెల్లడైందన్నాడు. చందా గ్రామం వెళ్లే రోడ్డు దగ్గర గోదాం అద్దెకు తీసుకొని అందులో నకిలీ ఎరువులను నిల్వ ఉంచినట్లు గుర్తించామన్నారు. 60 నకిలీ ఎరువుల బస్తాలు, ఒక కియా కార్, ఒక హీరో గ్లామర్ మోటార్ సైకిల్, ఆపిల్, రియల్ మీ సెల్ ఫోన్లు, ఆరు బిల్ బుక్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాడు.