హాజీపూర్, మే 15 : వివాహేతర సంబంధం..ఓ వ్యక్తి హత్యకు దారి తీసిన సంఘటన హాజీపూర్ మండల కేం ద్రంలో మంగళవారం రాత్రి జరిగింది. హాజీపూర్ ఎస్ఐ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..హాజీపూర్‌కు చెందిన మల్యాల నరేశ్ (32) గతంలో పెట్రోల్ బంక్‌లో పని చేసి ప్రస్తుతం ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి వివాహితతో పరిచయం..వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విష యం తెలుసుకొని నరేశ్‌కు భార్య దూరంగా ఉంటున్నది.
సదరు వివాహితకు ఆమె భర్త కూడా దూరంగా ఉంటున్నాడు. వివాహేతర సంబంధం విషయమై పలు మార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. అయినా వీరి ప్రవర్తనలో మార్పు రాలేదు. నరేశ్‌ను వివాహిత సోదరుడు ఆసాది చైతన్య పలుమార్లు హెచ్చరించాడు. అయినా వీరు వినలేదు. మంగళవారం రాత్రి వీరిద్దరూ కలిసి ఉండడాన్ని చైతన్య గమనించాడు.
అక్కడ జరిగిన గొడవలో నరేశ్‌ను చైతన్య నెట్టి వేశాడు. కింద పడిన నరేశ్ తలపై చైతన్య బండరాయితో కొట్టడంతో తీవ్ర రక్త స్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, హాజీపూర్ ఎస్ఐ సురేశ్ కుమార్ అక్కడికి చేరుకొని మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. నరేశ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నరేశ్‌కు భార్యతో పాటు కూతురు నిరీష ఉన్నారు.