ఆదిలాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన కళారులు, చేతి వృత్తిదారులకు చేయూతనందిస్తామని మాజీ రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ రూరల్ మండలం మూలాల గుట్టలో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా స్థానిక గిరిజనులు వెదురు వస్తువుల తయారీ ద్వారా ఉపాధి కల్పించేందుకు చేపట్టిన వెదురు మొక్కల పెంపకం పైలట్ ప్రాజెక్టును మాజీ మంత్రి జోగు రామన్నతో కలిసి ఆయన ప్రారంభించారు. అంతకుముందు గ్రామానికి వచ్చిన మాజీ ఎంపీ, మాజీ మంత్రి గిరిజనులు గుస్సాడీ నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు, స్థానిక గిరిజనులతో కలిసి వెదురు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ మాట్లాడుతూ మూలాల గుట్టకు చెందిన రావుజీ పటేల్ తనకున్న పది ఎకరాల్లో ఐదు ఎకరాల్లో వెదురు మొక్కలు పెంచేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగం గా ఐదు ఎకరాల్లో వెదురు మొక్కలు నాటి మూడేళ్ల పాటు కాపాడుతామని తెలిపారు. హస్తకళ నైపుణ్యం ఉన్న గిరిజనులు వెదురు వస్తువుల తయారీతో ఉపాధి పొందుతున్నారని చెప్పారు. అయితే క్రమంగా వెదురు చెట్లు లేకపోవడంతో ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా వెదురు మొక్కలు నాటి గిరిజనులకు ఉపాధి కల్పించడంతో పాటు, పర్యావరణ పరిరక్షణ కృషి చేస్తున్నట్లు తెలిపారు. గిరిజనులకు తమవంతుగా మరిన్ని సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని రాబోయే రోజుల్లో జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడుతామని తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనులు వెదురుతో వివిధ రకాల వస్తువులను తయారు చేసుకుంటూ ఉపాధి పొందుతారని, జిల్లాలో వెదురు లేకపోవడంతో వారు ఉపాధి కోల్పోతున్నారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. కుమ్రం భీం జిల్లా కాగజ్‌నగర్ నుంచి వెదురు మొక్కలు తీసుకురావాల్సి వస్తుందన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన వెదురు పెంపకం గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. గిరిజనులు కళాకారులను ప్రోత్సాహం అందించినట్లవుతుందన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా పట్టణంలోని దుర్గానగర్‌లో 10 లక్షల మొక్కలను నాటినట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం ఎన్నో సత్ఫలితాలనిచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, మాజీ జడ్పీటీసీ చారులత, నాయకులు యూనిస్ అక్బానీ, సాజిదుద్దీన్ మెట్టు ప్రహ్లాద్, గండ్రత్ రమేశ్, నారాయణ, రమణ, కుమ్ర రాజు, గెడం రాము, పందూర్ దేవన్న, బట్టు సతీశ్, లక్ష్మణ్, వేణుయాదవ్, కొండ గణేశ్, దమ్మపాల్, ప్రశాంత్, తదితరులున్నారు.
-మాజీ మంత్రి జోగు రామన్న
ఇచ్చోడ, అక్టోబర్ 17 : కేసీఆర్ హారిత స్ఫూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భా గంగా ముక్రా(కే) గ్రామంలో నాటిన లక్షపై చిలుకు మొకలు 100 శాతం బతకడం అద్భుతమని రాజ్యసభ మాజీ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రశంసించారు. శుక్రవా రం ఆదిలాబాద్‌లోని మూలల గుట్టకు వెదురు సాగు ప్లాంటేషన్ కార్యక్రమానికి వచ్చిన సంతోష్ కుమార్‌ను ముక్రా(కే) మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్ మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కను అందజేసి శాలువాతో సతరించారు.