మంచిర్యాల (ఏసీసీ), ఫిబ్రవరి 6 : కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని జాతీయ బీసీ హకుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని ఐబీ చౌరస్తాలోగల అంబేదర్ విగ్రహం దగ్గర అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ ఆర్థికపరమైన రిజర్వేషన్లు చెల్లవని, 1993లో ఇంద్రసహాని కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం 2019లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 103ను సవరించి ఈడబ్ల్యూఎస్ పేరుతో అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం దారుణమని మండిపడ్డారు.
ఈ విధానంతో బీసీలకు తీవ్ర అన్యాయం చేయడమే అవుతుందని, దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 14 శాతం మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలు తొమ్మిది శాతం మాత్రమే ఉన్నారని, ఇది వివక్ష కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, రాష్ట్ర బీసీ సంఘాల ఐక్య వేదిక, తెలంగాణ ఉద్యమ నాయకులు గజెల్లి వెంకటయ్య, జిల్లా కార్యదర్శి శాఖ పురి భీమ్సేన్, నాయకులు శ్రీపతి రాములు, చంద్రగిరి చంద్రమౌళి, కీర్తి భిక్షపతి, బండ సతీశ్, అంకం సతీశ్, షేక్ సల్మాన్, ఆరెందుల రాజేశం, బోడంకి కుమార్ పాల్గొన్నారు.