ఎండల దృష్ట్యా ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలి
ఒక్కటిగా ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధిలో ముందుంచుదాం
స్థాయీ సంఘాల సమావేశంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్
ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచన
ఎదులాపురం, మే 6 : జిల్లాలోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందించాలని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. జడ్పీ కార్యాలయంలోని తన ఛాంబర్లో శుక్రవారం స్థాయీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాథోడ్ జనార్దన్ మాట్లాడారు. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా ప్రజలకు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా నీరు అందించాలని సూచించారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక అయిన మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేసి ఇంటింటా నీరు అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదన్నారు. ఒక్కటిగాపనిచేసి, జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచుదామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీటీసీల ఫోరం అధ్యక్షుడు తాటిపెల్లి రాజు, భీంపూర్ జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, జడ్పీ సీఈవో గణపతి, డిప్యూటీ సీఈవో రాజేశ్వర్ రాథోడ్, డీఆర్డీవో కిషన్, వివిధ శాఖల జిల్లా అధికారులు మిల్కా, రాజలింగం, ప్రణీత, పద్మభూషన్రాజ్ పాల్గొన్నారు.
జడ్పీస్థాయీ సంఘం అంశాలు..
జిల్లాలోని గ్రామీణ మహిళా సంఘాల సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం 551 గ్రామ సం ఘా లు, 10,709 స్వయం సహాయక సంఘాలలోని 1,16,242 సభ్యులతో గ్రామీణాభివృద్ధి సంస్థ వివిధ కార్యక్రమాలు నిర్వహించిందని డీఆర్డీవో కిషన్ తెలిపారు. అలాగే 2021-22 సంవత్సరానికి 9,232 సంఘాలకు రూ.194. 66 కోట్ల లక్ష్యం నిర్దేశించినట్లు చెప్పారు. ఇందుకు ఏప్రిల్ నుంచి మార్చి నెల 2022 వరకు 5,119 సంఘాలకు రూ.178.41కోట్లు మంజూరుచేసినట్లు వెల్లడించారు. స్త్రీ నిధి కింద 17 మండలాల్లో 2021-22కు గాను రూ. 24.85 కోట్ల లక్ష్యంగా కాగా, రూ.27.67 కోట్ల రుణాలు మంజూరు చేశామని చెప్పారు. అలాగే మార్చి వరకు జిల్లా వ్యాప్తంగా 64,474 ఆసరా పింఛన్దారులకు రూ.14,63,56,952 పంపిణి చేశామన్నారు. ఉపాధి హామీ కింద 2022-23 సంవత్సరానికి గాను 59.91 లక్షల పనిదినాలు కల్పించాలని నిర్దేశించగా, ఇప్పటికే 3.24 లక్షల(8.86 శాతం) కల్పించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు వచ్చిన కూలీలకు రూ.23.30 కోట్లు చెల్లించామన్నారు. ‘మన ఊరు- మన బడి’ కింద ఎంపికైన పాఠశాలల్లో పనులను త్వరలో ప్రారంభించాలని తెలిపారు. ‘దళితబంధు’పై జిల్లా అధికారులుతో సమీక్షించారు. అనంతరం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, యువజన, క్రీడల శాఖ, ఐసీడీఎస్, జిల్లా సహకార, జిల్లా పరిశ్రమల, సంక్షేమ, జిల్లా ఉపాధి, పౌర సరఫరాల శాఖలతో పాటు వివిధ శాఖలపై సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు అడిన ప్రశ్నలను అధికారులు సమాధానం చెప్పారు.