మందమర్రి రూరల్ డిసెంబర్ 10 : సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి శిక్షణ కోర్సులను నిరుద్యోగులు, యువతులు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్, సేవా సమితి ఏరియా అధ్యక్షురాలు చింతల లక్ష్మి సూచించారు. సింగరేణి సేవా సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని ఇల్లందు క్లబ్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 2000 సంవత్సరం, డిసెంబర్, 10న సింగరేణి సేవా సమితి ఆవిర్భవించిందన్నారు.
మందమర్రి ఏరియాలో ఇప్పటివరకు టైలరింగ్, మగ్గం, బ్యూటీషియన్, డ్రైవింగ్ కోర్సులు, ఆర్మీ, పోలీస్ ఉద్యోగాలకు శిక్షణ, కంప్యూటర్ వంటి వాటిల్లో 14 వేల మందికి శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. కార్మిక కుటుంబాల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా యోగా శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిక్షణ పొందిన అభ్యర్థుల్లో చాలా మంది ఉద్యోగాలు పొందారని తెలిపారు. అనంతరం జీఎం చింతల లక్ష్మీ శ్రీనివాస్ దంపతులను సేవా సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేశ్, పర్సనల్ డిపార్ట్మెంట్ హెచ్‌వోడీ శ్యాం సుందర్ సేవా కో ఆర్డినేటింగ్ ఆఫీసర్ మైత్రేయ బంధు, సేవా ఫ్యాకల్టీ, సేవా సభ్యులున్నారు.
శ్రీరాంపూర్, డిసెంబర్ 10: శ్రీరాంపూర్ కాలనీ సేవా భవన్లో శనివారం సింగరేణి ఎంప్లాయీస్ వైఫ్స్ అసోసియేషన్ (సేవా) ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. సేవా అధ్యక్షురాలు రాధాకుమారి సంజీవరెడ్డి, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి పాల్గొని సేవా సమితి ఆవిర్భావ దినోత్సవ కేక్ కట్ చేసి మహిళలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సేవా ఆవిర్భవించి 22 సంవత్సరాలు అవుతుందన్నారు. 2000 డిసెంబర్ 10న ఆవిర్భవించిందన్నారు. సేవా కార్యక్రమాలు కొన సాగిస్తూ కార్మికుల కుటుంబాలతో మంచి పారిశ్రామిక సంబంధాలు కొనసాగిస్తున్నామని చెప్పారు.
సేవా సమితి శిక్షణతో మహిళలు సొంతంగా యూనిట్లు పెట్టుకొని ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా దివ్యాంగులు, విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డిని సేవా సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీవైజీఎం గోవిందరాజు, సేవా కార్యదర్శి కొట్టె జ్యోతి, సహాయ కార్యదర్శి రత్నకళ, తిరుమల, శ్రీలత, శారద, సీనియర్ పీవో కాంతారావు, పాలకుర్తి రాజు, చాట్ల అశోక్, తోట సురేశ్ పాల్గొన్నారు.