సోన్, మార్చి 4 : ‘నేటి విద్యుత్ ఆదా.. రేపటి విద్యుత్ మిగులు’ నినాదంతో ముందుకెళ్లాల్సిన తరుణమిది. విద్యుత్ పొదుపు చేయడం వల్ల విద్యుత్ భారం తగ్గుతోంది. పొదుపు మంత్రం పాటిస్తూ ప్రభుత్వానికి బాసటగా నిలవాలి. విద్యుత్ వినియోగం ప్రధానంగా వ్యవసాయ, గృహావసరాలు, పారిశ్రామిక రంగాలకు పెద్ద మొత్తంలో ఉంటుంది. ప్రధానంగా వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి అందిస్తోంది. దీంతో జిల్లాలో సాగు విస్తీర్ణం గతంలో కంటే గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ను పొదుపుగా వాడాలి. గృహస్తులు, వ్యాపారస్థులు, రైతన్నలు కొన్ని సూచనలు పాటిస్తూ విద్యుత్ దుబారాను అరికట్టడంతోపాటు ఆర్థికభారం నుంచి తప్పించుకోవచ్చు. వేసవికాలం మొదలుకావడంతో ఎండలు మండిపోతున్నాయి.
దీంతో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోందని ఎన్పీడీసీఎల్ అధికారులు పేర్కొంటున్నారు. గృహ, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు కలిపి 3 లక్షల విద్యుత్ కనెక్షన్లుండగా.. రోజూ వారి వినియోగం దాదాపు 4 మిలియన్ యూనిట్ల వాడకం ఉంది. గతంలో కంటే వేసవి ఆరంభం మొదలైన నేపథ్యంలో గణనీయంగా విద్యుత్ వినియోగం పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్‌లు, ఫ్యాన్ల వంటి విద్యుత్ పరికరాలను విస్తృతంగా వాడుతుండడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. దీంతో వినియోగదారులకు ఇబ్బంది లేకుండా విద్యుత్‌శాఖ అధికారులు డిమాండ్ మేరకు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. ఫలితంగా విద్యుత్ బిల్లు కూడా గతంలో కంటే అధికంగా వచ్చే అవకాశం ఉంది. బిల్లు తక్కువ నమోదు కోసం విద్యుత్ వినియోగదారులు పొదుపు మంత్రం పాటించాలని అధికారులు పేర్కొంటున్నారు.
సౌర విద్యుత్ మేలు..
వేసవి నేపథ్యంలో విద్యుత్‌కు అధిక డిమాండ్ ఉండడంతో కొరతను కొంత మేర నివారించేందుకు సౌర విద్యుత్ తోడ్పడుతోంది. వినియోగదారులు సౌర విద్యుత్‌ను వినియోగించడం వల్ల విద్యుత్‌ను ఆదా చేసినవారమవుతాం. ఒక్కసారి పెట్టుబడి పెట్టి ఏళ్ల తరబడి ఉచితంగా సౌర విద్యుత్‌ను పొందవచ్చు. నివాస భవనాలు, వ్యవసాయ క్షేత్రాలు, ఖాళీ స్థలాల్లో సౌర విద్యుత్ ప్లాంటును ఒక్కసారి నెలకొల్పుకొని ఎన్నో ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్‌ను వాడుకోవచ్చు. దీనిద్వారా భవిష్యత్ తరాలకు విద్యుత్‌ను ఆదా చేసి మేలు చేసినవారమవుతాం.
పొదుపు చేద్దాం..
విద్యుత్ వాడకాన్ని సాధ్యమైనంత తగ్గిస్తున్నా..
వేసవితాపం పెరిగిపోతుండడంతో రోజురోజుకూ విద్యుత్ వాడకం ఎక్కువవుతున్నా మాట వాస్తవ మే. అయినప్పటికీ నా దుకా ణంలోకి వచ్చే కస్టమర్ల గిరా కీని అనుసరించి అందరి ఒకే సారిగా జిరాక్స్ ప్రతులను తీస్తున్నా. తద్వారా విద్యుత్ అధిక వినియోగాన్ని సాధ్యమైనంతగా ఆదా చేస్తున్నా. కంప్యూటర్, జిరాక్స్ మిషన్, ఫ్యాన్ల వంటి విద్యుత్ పరికరాలను అవసరమైనంత మేరకే వాడుతున్నా. విద్యుత్ పొదుపును చేయడంలో నావంతు ప్రయత్నం చేస్తున్నా.
– కడారి గణేశ్, జిరాక్స్ సెంటర్ నిర్వాహకులు, నిర్మల్.
ఆదా చేయడం బాధ్యతగా భావించాలి..
విద్యుత్ వినియోగానికి సరిపడా సరఫరా ఉన్నప్పటికీ విద్యుత్‌ను ఆదా చేయడం వినియోగదారులు బాధ్యతగా భావించాలి. నాణ్యమైన విద్యుత్ పరికరాలను వినియోగించుకోవాలి. వ్యవసాయ క్షేత్రాల్లో అనవసరంగా పంపుసెట్లను ఆన్‌లో ఉంచకూడదు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎలక్ట్రికల్ వస్తువులను విధిగా ఆఫ్ చేయాలి. ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపుపై అవగాహన కలిగి ఉండాలి.
– జయంత్‌రావు చౌహన్, విద్యుత్ శాఖ జిల్లా అధికారి, నిర్మల్.