ఖానాపూర్, మే 24 : నూతనంగా ఏర్పాటైన మున్సిపల్ అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి సూచించారు. బుధవారం ఉదయం 8 గంటలకు ఖానాపూర్ పట్టణంలో ఆకస్మికంగా పర్యటించారు. ముందుగా వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. వరి ధాన్యం క్వింటాలుకు ఎన్ని కిలోలు తూకం వేస్తున్నారని రైతులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయవద్దని, ప్రభుత్వ అదేశాల ప్రకారం కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం మున్సిపల్ పార్కును పరిశీలించారు. పట్టణ వాసులకు అనుగుణంగా పార్కును సుందరంగా తీర్చిదిద్దాలని చైర్మన్ రాజేందర్‌కు సూచించారు. పార్కులో ఏర్పాటు చేసిన నర్సరీలో ఆలస్యంగా మొక్కలు పెంచడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్టోబర్‌లో మొక్కలు పెంచడానికి చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. మేలో నర్సరీ పనులు ప్రారంభించడం ఏంటని మెప్మా సిబ్బందిని ప్రశ్నించారు.
మున్సిపల్ పార్కులోకి వచ్చే ప్రజల నుంచి వాకర్ టోకెన్ ఇచ్చి రుసుము వసూలు చేయాలని మున్సిపల్ చైర్మన్‌ను అదేశించారు. పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేయాలని సూచించారు. మున్సిపల్ అభివృద్ధికి ఉపయోగపడేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. అక్కడి నుంచి బస్టాండ్ సమీపంలోని సమీకృత మార్కెట్ పనులను పరిశీలించి గడువులోగా నాణ్యతతో కూడిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. తహసీల్ కార్యాలయ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో సిబ్బంది విధులు ఎలా నిర్వహిస్తున్నారని తహసీల్దార్ రాజ్‌మోహన్ అడిగి తెలుసుకున్నారు. నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో నెలకొన్న సమస్యలపై కౌన్సిలర్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ మనోహర్, కౌన్సిలర్లు రాజురా సత్యం, తొంటి శ్రీను, నాయకులు సంతోష్, షబ్బీర్‌పాషా, రెవెన్యూ, మున్సిపల్, మెప్మా సిబ్బంది, ప్రజాప్రతినిధులున్నారు.
ప్రభుత్వ దవాఖాన తనిఖీ
ఖానాపూర్ టౌన్,మే 24 : ఖానాపూర్ ప్రభుత్వ దవాఖానను కలెక్టర్ వరుణ్‌రెడ్డి తనిఖీ చేశారు. అందులో భాగంగా వార్డుల్లో రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఎన్ని వార్డులు ఉన్నాయి? ఎంత మంది వైద్య సిబ్బంది ఉన్నారు? తదితర వివరాలను సూపరింటెండెంట్ వంశీమాధవ్‌ను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ రాజమోహన్, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, కమిషనర్ మనోహర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పండుగ వాతావరణంలో ఉత్సవాలు
నిర్మల్ టౌన్, మే 24 : తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 2 నుంచి 22 వరకు దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో జరుపుకోవాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి సంబంధిత అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించడంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ప్రతిరోజూ ఒక్కశాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో జాతీయ పతాక ఆవిష్కరణ, రైతు దినోత్సవం, సురక్షా దినోత్సవం, తెలంగాణ విద్యుత్ విజయోత్సవం, పారిశ్రామిక ప్రగతి, చెరువుల పండుగ, తెలంగాణ సంక్షేమ సంబురాలు, సుపరిపాలన, సాహిత్య దినోత్సవం, తెలంగాణ రన్, మహిళా దినోత్సవ సంక్షేమం, వైద్య రంగ దినోత్సవం, తెలంగాణ పట్టణ ప్రగతి, గిరిజనోత్సవం, మంచినీళ్ల విప్లవం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పదేండ్ల కాలంలో రాష్ట్రం ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. వీటిని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.