బోధన్, జూలై 9: మహారాష్ట్రలోని హింగోళి జిల్లాలో భూకంపం సంభవించింది. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత 1.37 గంటలకు సంభవించిన భూకంపం ప్రభావం జిల్లాలో కనిపించింది. నిజామాబాద్ జిల్లా సరిహద్దుకు సమీపంలో హింగోళి జిల్లా, ఆ పక్కన నాందేడ్ జిల్లా ఉన్నాయి. హింగోళి కేంద్రంగా భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.6గా నమోదైంది. అర్ధరాత్రి 1.37 నుంచి తెల్లవారుజామున 3.26 గంటల వరకు హింగోళి జిల్లాలో భూంకంపం తీవ్రత ఎక్కుగా ఉండగా, నాందేడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తక్కువ తీవ్రతతో భూ ప్రకంపనలు కొనసాగాయి.
131 కిలో మీటర్ల దూరంలో వాయువ్య దిశలో ఉన్న నిజామాబాద్ జిల్లాలోని సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నాందేడ్‌తో జిల్లా ప్రజలకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. హింగోళి జిల్లాతోనూ జిల్లాకు అనుబంధం ఉంది. భూకంపం రాగానే నాందేడ్, హింగోళి జిల్లాల్లోని బంధువులు, సన్నిహితులు ఇక్కడివారికి గురువారం తెల్లవారకముందే సమాచారం అందించారు. దీంతో ఇక్కడివారిలో సహజంగానే కలవరం మొదలైంది.తమవారి క్షేమ సమాచారం తెలుసుకున్నారు.
1993 సెప్టెంబర్ 30న జిల్లా సరిహద్దుకు 300 కిలోమీటర్ల దూరంలోని లాతూర్ జిల్లా కిల్లారి గ్రామం కేంద్రంగా రిక్టార్ స్కేల్‌పై 6.2 నుంచి 6.4 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఈ భూకంపం ప్రభావం జిల్లాలో స్పష్టంగా కనిపించింది. అప్పుడు వచ్చిన భూప్రకంపనలు జిల్లాలోని ప్రజలను భయాందోళనకు గురిచేసింది. నాందేడ్ జిల్లాలో 2006, 2007, 2011 సంవత్సరాల్లో భూప్రకంపనలు సంభవించాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం హింగోళి భూకంపం రావడంతో సరిహద్దులోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.