బెల్లంపల్లి : ఇంజినీరింగ్ ( Engineering ) , ఫార్మసీ కోర్సుల్లో ( Pharmacy Courses ) ప్రవేశం కోసం నిర్వహించే ఈసెట్-2025 కౌన్సెలింగ్ ( e Set Counseling ) ప్రక్రియ ఈనెల 17 నుంచి ప్రారంభం అవుతుందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, కౌన్సెలింగ్ అధ్యయన కేంద్రం కో ఆర్డినేటర్ దేవేందర్ రెడ్డి తెలిపారు. మొదటి దశ కౌన్సెలింగ్ జూన్ 14 నుంచి 18 వరకు విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుని తమ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.
స్లాట్ బుక్ చేసిన అభ్యర్థులు జూన్ 17 నుంచి 19 వరకు కౌన్సెలింగ్ కేంద్రంలో హాజరై తమ ధ్రువపత్రాల పరిశీలించుకోవాలని సూచించారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం, అభ్యర్థులు తమ కోర్సులు , కాలేజీల ఎంపికను జూన్ 21 లోపు ఫ్రీజ్ చేసుకోవాలని సూచించారు. ఆప్షన్ ఫ్రీజింగ్ పూర్తయిన తరువాత సీటు కేటాయింపు , ఫలితాలు ప్రకటించబడతాయని పేర్కొన్నారు. అభ్యర్థులు అలాట్ అయిన కళాశాలలో నిర్ణీత తేదీలోగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని వివరించారు.
అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలు ఈసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, 10వ తరగతి మెమో, డిప్లోమా, బీఎస్సీ మార్క్స్ మెమోలు, టీసీ, స్టడీ సర్టిఫికెట్లు, కుల, ఆదాయం, నివాస, ఎన్సీసీ, స్పోర్ట్స్, పీహెచ్సీ సంబంధిత ధ్రువపత్రాలు అందజేయాలని సూచించారు. వెరిఫికేషన్‌కు అభ్యర్థి వ్యక్తిగతంగా హాజరవ్వాలని, ఫ్రీజ్ చేయని అభ్యర్థులను సీటు కేటాయింపులో పరిగణనలోకి తీసుకోరని స్పష్టం చేశారు. అభ్యర్థులు , తల్లిదండ్రులు అధికారిక వెబ్సైట్ https://tgecet.nic.in ను తరచూ తనిఖీ చేయాలని సూచించారు .