చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చెప్పుకునే విజయదశమి రానే వచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ఈ వేడుక జరుపుకునేందుకు ప్రజానీకం సిద్ధమైంది. ఇక విద్యుద్దీపాలతో ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగా, కొత్త శోభ సంతరించుకున్నది. పలుచోట్ల రామ్లీల నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
– చెన్నూర్ టౌన్, అక్టోబర్ 22
చెన్నూర్ టౌన్, అక్టోబర్ 22 : దసరా.. హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. పదో రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. దీనిని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కాబట్టి ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగను మొదటి మూడు రోజులు పార్వతీ దేవికి, తర్వాత లక్ష్మీదేవికి, తర్వాత మూడు రోజులు సరస్వతీ దేవికి పూజలు నిర్వహిస్తారు. అలాగే ఆలయాల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. తెలుగువారు దసరాను 10 రోజులు జరుపుకుంటారు. తెలంగాణలో 9 రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడతారు. పలు చోట్ల రావణాసుర దహనం పేరిట ‘రామ్లీల’ నిర్వహిస్తుంటారు. ఈ యేడాది మంచిర్యాల జిల్లాలో 23వ తేదీ సోమవారం విజయదశమి నిర్వహించనున్నారు.
చెడుమీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. మనిషి తనలోని కామ, క్రోధ, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్థ, అన్యాయ, అమానవత, అహంకారం అనే పది దుర్గుణాలను ఈ నవరాత్రుల్లో తొలగించుకునేందుకు ఆధ్యాత్మికంగా ఉత్తమమైన మార్గం. దీనిని 10 రోజుల పాటు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గపూజ ఉంటుంది. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుడిపై గెలిచిన సందర్భమే కాకుండా పాండవులు వనవాసం వెళ్తూ జమ్మిచెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజుగా చెబుతుంటారు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం అనవాయితీగా వస్తున్నది. జగన్మాత అయిన దుర్గాదేవి, మహిషాసురుడనే రాక్షసుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భంగా పదో రోజు ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకున్నారు. అదే విజయదశమిగా పేర్కొంటారు.
బ్రహ్మదేవుడి వరాలతో వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్రి ప్రకాశవంతమైన తేజంగా మారింది. త్రిమూర్తుల తేజం కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది. శివుని తేజం ముఖంగా, విష్ణు తేజం బాహువులుగా, బ్రహ్మతేజం పాదాలుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 చేతులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణ దేవుడు పాశం, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలం హిమవంతుడు సింహాన్ని వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధాలు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది.
మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషాసురు రూపం, సింహరూపం, మానవ రూపంతో భీకరంగా పోరు, చివరకు మహిషి రూపంలో దేవి చేతిలో హతుడయ్యాడు. అప్పటి నుంచి మహిషుని సంహరించిన రోజు దసరా పర్వదినంగా పిలుస్తారు. అదే విజయదశమి రోజునే శమీ పూజ కూడా నిర్వహిస్తారు. శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మిచెట్టు చెక్కతోనే నిర్మించారని చెబుతారు. శమీ అంటే పాపాల్ని, శత్రువులను నశింపజేసేది. పంచపాండవులు అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను శమీ చెట్టుపై పెట్టారు. సామాన్యులే కాకుండా యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ఆలయాల్లో అమ్మవారికి విశేష అలంకరణలు చేసి పూజిస్తారు.
దసరా పండుగ ఈనెల 23వ తేదీనే జరుపుకోవాలి. 23 లేదా 24తేదీల్లో ఏరోజు జరుపుకోవాలనే సంశయాన్ని పండిత సభా నివృత్తి చేసింది. భక్తుల అయోమయాన్ని తొలగించింది. సోమవారం మధ్యాహ్నం నుంచి దశమి తథి ఉండడం, శ్రవణా నక్షత్రం సోమవారం రోజే ఉండడంతో 23వ తేదీనే పండుగను జరుపుకోవాలి. సాయంత్రం శమీ (జమ్మిచెట్టు) దర్శనం చేసుకోవాలి. అమ్మవారిని పూజించడంతో సకలపాపాలు తొలగిపోతాయి. విజయాలు కలుగుతాయి.
– వేమారపు మహేశ్వర్ శర్మ, పూజారి, శివాలయం, చెన్నూర్