చెన్నూర్ టౌన్/మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 2 : దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అన్ని మండలాల్లోని దుర్గాదేవి ఆలయాలు, మండపాల్లో నిర్వాహకులు, భక్తులు ఏర్పాట్లు చేశారు. విజయదశమికి ముందు నవరాత్రుల్లో తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తాం. ప్రతి అవతారానికీ ఒక అర్థం ఉంది. ప్రతిదేవి పూజ వెనుక ఆధ్యాత్మిక విశిష్టత ఉంది. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మూడో తేదీన గురువారం నుంచి 12వ తేదీ శనివారం విజయదశమి వరకు వైభవంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం మండపాలను ఏర్పాటు చేసి, ఆలయాలను రంగు రంగుల విద్యుద్దీపాలతో నిర్వాహకులు అలంకరించారు.
తొమ్మిది రోజులు.. తొమ్మిది రూపాలు
మొదటి రోజు గురువారం అమ్మవారు బాల త్రిపుర సుందరీ దేవి అవతారంలో దర్శనమిస్తుంది. ఈ సందర్భంగా శాంతిపాఠం, దీపారాధన, నవరాత్రోత్సవ సంకల్పంతో పలు విధాలా పూజలందుకుంటుంది. సాయంత్రం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ ఉంటుంది. రెండో రోజు శుక్రవారం గాయత్రీ దేవి అవతారంలో, మూడో రోజు అన్నపూర్ణాదేవిగా, నాలుగో రోజు వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవిగా, ఐదోరోజు లలితా త్రిపుర సుందరి అవతారంలో దర్శనమివ్వనున్నారు. ఆరో రోజు మహాలక్ష్మీదేవి అవతారంలో, ఏడో రోజు సరస్వతీ దేవి అవతారంలో, ఎనిమిదో రోజు కనకదుర్గాదేవి, తొమ్మిదో రోజు మహిషాసుర మర్ధని దేవి అవతారంలో దర్శనమిస్తుంది. పదో రోజు రాజరాజేశ్వరీ దేవి అవతారంలో దర్శనమిస్తుంది. అదే రోజు సాయంత్రం అమ్మవారి శోభాయాత్ర ఉంటుంది.