మంచిర్యాల, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాలలోని ఆండాలమ్మ కాలనీలోగల డంప్‌యార్డు సమస్య పరిష్కారమయ్యేలా లేదు. మూడు నెలల్లో ఇక్కడి నుంచి తరలిస్తామంటూ ఎన్జీటీకి నివేదిక ఇచ్చిన అధికారులు తొమ్మిది నెలలైనా పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. దట్టమైన పొగతో అనారోగ్యం పాలవుతున్నామని, ఇచ్చిన మాట ప్రకారం డంప్‌యార్డును వేరేచోటికి మార్చాలని స్థానిక ప్రజానీకం వేడుకుంటున్నది.
ఆండాలమ్మ కాలనీలోని డంప్ యార్డును నగరానికి దూరంగా తరలించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడి వ్యర్థాలను కాల్చినప్పుడు వెలువడే దట్టమైన పొగ, కార్బన ఉద్గారాలతో తరచూ అనారోగ్యానికి గురవుతున్నామని, ఇక్కడి నుంచి డంప్‌యార్డును తరలించాలని స్థానికులు ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో గతేడాది జాతీయ హరిత ట్రెబ్యునల్ (ఎన్జీటీ)కి ఫిర్యాదు చేశారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు కలెక్టర్, మంచిర్యాల మున్సిపల్ కమిషనర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారితో జాయింట్ కమిటీ ఏర్పాటు చేశారు.
డంప్‌యార్డు పరిశీలించిన కమిటీ ఇక్కడి పరిస్థితులపై రిపోర్ట్‌ను సబ్మిట్ చేసింది. మూడు నెలల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని గతేడాది ఏప్రిల్‌లో నివేదిక ఇచ్చింది. కానీ, తొమ్మిది నెలలు గడుస్తున్నా డంప్‌యార్డు తరలింపు ప్రక్రియ ముందుకు కదల్లేదు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమేగాక ఎన్జీటీని తప్పుదోవ పట్టించేలా అధికారులు నివేదిక ఇచ్చారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.
త్రీమెన్ కమిటీ ఎన్జీటీకి ఇచ్చిన నివేదికలో పేర్కొ న్న అంశాలన్నీ అవాస్తవాలని స్థానికులు మండిపడుతున్నారు. డంప్‌యార్డు దగ్గర పగలు మాత్రమే సెక్యూరిటీ సిబ్బంది ఉంటున్నదని, రాత్రివేళ ఎవ రూ ఉండడం లేదని వారు చెబుతున్నారు. బయోమైనింగ్‌లో మిగిలిపోయిన చెత్తకు రాత్రివేళ నిప్పుపెడుతున్నారని, దీంతో భరించలేని దుర్వాసనతో పాటు పొగ వస్తుందని వాపోతున్నారు. రాత్రివేళ గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి కాల్చి పోతున్నారని చెబుతున్న అధికారులు వారిని పట్టుకునేందుకు ఎ లాంటి చర్యలు తీసుకోవడం లేదంటున్నారు.
డంప్ కు మంటలు అంటుకున్నప్పుడు వాటిని ఆర్పేందుకు వాటర్ ట్యాంకర్లు పెట్టినట్లు చెప్పింది అవాస్తవమే అంటున్నారు. మంటలు అంటుకున్నప్పుడు మాత్రమే ఆ ట్యాంకర్లు వచ్చి చల్లారుస్తున్నాయి త ప్పితే అక్కడే అందుబాటులో ఉండడం లేదని చెబుతున్నారు. గడిచిన పదిరోజులుగా నిత్యం పొగలు వస్తూనే ఉన్నాయి అంటున్నారు. ఒక్కసారి నిప్పు పెట్టి పోతే రోజుల తరబడి పొగలోనే బిక్కుబిక్కుమంటూ ఉండాల్సి వస్తుందని వాపోతున్నారు. మొ న్నటి వరకు డంప్‌యార్డును తరలిస్తామని చెప్పిన అధికారులు కొన్ని రోజులుగా బయో మైనింగ్ చేస్తున్నాం.. ఇక ఎక్కడికి తరలించేది లేదని చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్జీటీకి ఇచ్చిన నివేదికను అనుసరించి డంప్ యార్డును సాధ్యమైనంత త్వరగా ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో పని చేసిన కలెక్టర్ డంప్యార్టును ముందు పోచంపాడుకు తరలిస్తామని చెప్పారని, అక్కడ కుదరకపోవడంతో నస్పూర్ పరిధిలోని తాటిపల్లి గ్రామంలోని 20 ఎకరాల్లోకి తరలిస్తామని చెప్పారని గుర్తు చేశారు. స్థానికులకు ఎదురవుతున్న ఇబ్బందులు, అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా అధికారులు డంప్‌యార్డును తరలించేందుకు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.