సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు సూపర్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్తో పాటు అభ్యర్థులైన కోనేరు కోనప్ప, కోవ లక్ష్మి, దుర్గం చిన్నయ్యలో ఖుష్ కనిపిస్తున్నది. ప్రజలు వేలాదిగా తరలివచ్చి బ్రహ్మరథం పట్టగా శ్రేణుల్లో నూతనో త్సాహం ఉరకలేస్తున్నది. పదేళ్లలో సర్కారు చేపట్టిన అభివృ ద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్ చక్కగా వివరించగా, ప్రజలను ఆలోచింపజేసింది.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ధరణిని తొలగిస్తుందని.. రైతు బీమా, రైతుబంధు,ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మివంటి పథకాలు ఆగిపోతాయని చెప్పగా.. ఆయా వర్గాల్లో చర్చ మొదలైంది. తమ ప్రభుత్వం మాటకు కట్టుబడి ఉంటుందని, మళ్లీ అధికారంలోకి రాగానే మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో అనూహ్య స్పందన వచ్చింది. ఆయాచోట్ల జనసంద్రాన్ని చూసి ‘కారు’ గెలుపు దాదాపు ఖాయమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతుండగా, ప్రతిపక్ష పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
– కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/ బెల్లంపల్లి, నవంబర్ 9
కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ శ్రేణుల్లో నయా జోష్ నెలకొన్నది. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లలో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతమవడంతో కార్యకర్తల్లో నూతనోత్సాహం ఉరకలేస్తున్నది. ఆలోచించకుండా ఇతర పార్టీలకు ఓటు వేస్తే ఆగమైపోతామని, రైతు బీమా, రైతు బంధు వంటి ఆదర్శవంతమైన పథకాలతోపాటు పింఛన్లు, కల్యాణ లక్ష్మి, వంటి ఇతర సంక్షేమ పథకాలు ఆగిపోతాయని, బీఆర్ఎస్ పాలనలో పదేండ్లలో జరిగిన అభివృద్ధిపై గ్రామల్లో చర్చించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగంలో చెప్పడంపై ప్రజల్లో చర్చమొదలైంది.
ధరణిని తొలగిస్తామని కాంగ్రెస్ పదే పదే ప్రచారం చేయడంపై రైతుల్లో ఆ పార్టీ పట్ల నిరాసక్తత కలుగుతున్నది. రైతుల కోసం బీఆర్ఎస్ అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ వంటి బృహత్తర పథకాలు నేరుగా, నిష్పక్షపాతంగా వారి ఖాతాల్లోకి చేరుతున్నాయంటే అందుకు ధరణీ కారణం. ఇలాంటి ధరణిని కాంగ్రెస్ అధికారంలోనికి వస్తే.. తొలగిస్తే మళ్లీ రెవెన్యూ శాఖలో దళారీల వ్యవస్థ మొదలవుతుందని చెప్పడం ఆలోచనలను కలుగజేసింది. ప్రజా ఆశీర్వాద సభలకు వేలాదిగా జనం తరలిరావడం ప్రతిపక్ష పార్టీల ఆశలను సన్నగిల్లేలా చేసింది. దీంతో జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని తేలిపోయింది.
ఈ సభలకు ఊహించిన దాని కంటే అధికంగా ప్రజలు తరలిరావడం, ప్రతీ గ్రామం నుంచి హాజరవడంతో బీఆర్ఎస్ అభ్యర్థుల్లో భారీ మెజార్టీతో గెలుపుపై ధీమా కనిపిస్తున్నది. సీఎం ప్రసంగంతో జోష్‌లో ఉన్న పార్టీ కార్యకర్తలు, శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో గ్రామాల్లో ప్రచారం మొదలు పెట్టా రు. ముఖ్యమంత్రి సభల సందర్భంగా జిల్లాలోని వివిధ కుల సంఘాల పెద్దలు, ఇతర పార్టీల్లోని నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరడంతో జిల్లాలో బీఆర్ఎస్ ప్రభంజనం పెరుగుతున్నది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గ్రామా ల్లో పార్టీ బలం పెరుగుతుండడంతో కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొంటున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటు చేయడంతోపాటు, ఆదివాసులకు పోడు పట్టాలు ఇవ్వడం.., ఆసిఫాబాద్‌లో మెడికల్ కళాశాల ఏర్పాటు.., కాగజ్‌నగర్‌లో ఎస్పీఎం పేపర్ మిల్లు ప్రారంభించిన విషయాలను సీఎం కేసీఆర్ ప్రసంగంలో గుర్తు చేశారు. ఆసిఫాబాద్‌లో కోవ లక్ష్మిని, సిర్పూర్లో కోనేరు కోనప్పను భారీ మెజార్టీతో గెలిపిస్తే మరో ఐదేళ్లపాటు సంక్షేమ పథకాలు కొనసాగడంతోపాటు, మరిన్ని హామీలు నెరవేరుస్తామని పేర్కొనడంతో రైతులతోపాటు సామాన్య ప్రజలను సైతం ఆలోచింపజేసిం ది. గిరిజనులకు పోడు పట్టాలు అందించినట్లుగా, గిరిజనేతరుల భూ సమస్యలను పరిష్కరించి, హ క్కులు కల్పిస్తామని చెప్పడంతో గిరిజనులతోపా టు, గిరినేతర రైతులను కూడా ఆలోపించ జేసింది.
బెల్లంపల్లి, నవంబర్ 9 : బెల్లంపల్లిలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ పెద్ద ఎత్తున విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. మున్సిపాలిటీలోని 34 వార్డులతో పాటు బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట, నెన్నెల, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ఉదయం నుంచి బెల్లంపల్లి ప్రధాన రోడ్లు గులాబీమయంగా మారాయి. తిలక్‌స్టేడియంలో నిర్వహించిన సభలో 50 వేలకు పైగా ప్రజలు హాజరయ్యారు.
స్టేడియం నిండిపోవడంతో వేలాది మంది మెయిన్‌రోడ్డు, బజార్ ఏరియాలో రోడ్డు పైనే ఉండి సీఎం స్పీచ్ చాలా శ్రద్ధగా విన్నారు. మరికొంత మంది చుట్టుపక్కల భవనాలు, గోడలపై ఉండి తిలకించారు. కేసీఆర్ సభకు వచ్చిన వారిని చూసి ప్రతిపక్షాలు డీలా పడిపోతున్నాయి. బెల్లంపల్లిలో బీఆర్ఎస్ విజయం ఇక నల్లేరుపై నడకే అని తేలడంతో వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సీఎం కేసీఆర్ సభకు చేరుకోగానే, సభాస్థలి వద్ద ఉన్న ప్రధాన నాయకులతో పాటు, ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో చేతిలో ఉన్న గులాబీ కండువాలు, దస్తీలు, జెండాలు, చేతులు పైకెత్తి ఊపుతూ స్వాగతం పలకడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సింగరేణి డ్రెస్ కోడ్‌తో వచ్చిన శాంతిఖని గని కార్మికులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీబీజీకేఎస్ గని పిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్మికులు యూనిఫాం, హెల్మెట్ ధరించి బైక్‌పై ర్యాలీగా శాంతిఖని గని నుంచి సభ వద్దకు తరలివచ్చారు. సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో బెల్లంపల్లి సింగరేణి చరిత్రను గుర్తు చేయడంతో కార్మికుల్లో ఉత్సాహం నింపింది.
ఇల్లెందు తర్వాత బొగ్గు తవ్వకాలు బెల్లంపల్లిలోనే జరిగాయని వివరించారు. 134 ఏండ్ల చరిత్ర ఉన్న ఉద్యమ, పోరాటాల గడ్డ బెల్లంపల్లి అని స్పష్టం చేశారు. కాంగ్రెసోళ్ల చేతిలో సింగరేణిని పెట్టి ఆగం కావద్దని సూచించిన తీరు కార్మికులను ఆలోచింపజేసింది. ఈ ఏడాది దసరా, దీపావళి, బోనస్, లాభాల్లో వాటా కలిసి రూ. వెయ్యి కోట్లు కార్మికులకు అందించాయని చెప్పడంతో కార్మికుల నుంచి అనూహ్య స్పందన లభించింది. సింగరేణిని కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందనే ప్రసంగం కార్మిక లోకాన్ని ఆలోచింపజేసింది. కేసీఆర్ ప్రసంగం మరోసారి ఉత్సాహాన్ని ఉరకలెత్తించింది.
సీఎం కేసీఆర్ ప్రసంగించిన 20 నిమిషాలు తన మార్క్ పంచ్‌లతో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నారు. మంది మాటలు పట్టుకొని మార్వానం పోతే.. మళ్లొచ్చే సరికి ఇండ్లు కాలినట్లు.., తీర్థం పోదం తిమ్మక్క అంటే వాడు గుల్లే.. వీడు సల్లే.., కాంగ్రెస్ పార్టీ గురించి సామెతలు చెప్పి సభను చప్పట్లతో ఉర్రూతలూగించారు. మూడు గంటల కరెంట్, రైతు బంధు కట్, ధరణి బంద్ తదితర పథకాలపై ఆ పార్టీ చేస్తున్న విమర్శలను ఒక్కొక్కటిగా ప్రజలను అడుగుతూ వారిని ఆలోచింపజేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజల జీవితాలు మరోసారి ఆగమాగమవుతాయనే విషయాన్ని ప్రజలు గ్రహించారు.
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే నా యకుడిని ఆదరించాలని, స్థానికుడైన దుర్గం చిన్నయ్యను మూడోసారి గెలిపించుకోవాలి సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు. పథకాలు అమలు కావాలంటే చిన్నయ్యను భారీ మెజార్టీతో గెలిపించుకుంటేనే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలోనే వచ్చే నాయకులను తరిమికొట్టాలని, ప్రజల ఆలనాపాలనా చూసే మంచి పేరున్న నాయకుడు చిన్నయ్య అని తెలిపారు. ఎన్నికలు వస్తాయి.. పోతాయి..విచక్షణతో ఆలోచించి, నిజనిజాలు తెలుసుకొని మంచి అభ్యర్థులను గెలిపిస్తే.. మెరుగైన ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు మేలు జరుగుతుంది వివరించారు. సూటుకేసులతో వచ్చేవారిని నమ్మి ఆగం కావద్దు అని పేర్కొన్నారు.