నిర్మల్ అర్బన్, మే 15 ః సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు యువకులు పోలీసులకు అడ్డంగా దొరికిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకున్నది. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. నిర్మల్ పట్టణానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్లు షేక్ ఫర్ధీన్, మహ్మద్ పర్వేజ్(విద్యార్థి), చౌహాన్ గోవింద్, మహ్మద్ అబ్ధుల్ డానిష్‌లు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మిడజోలం ఇంజక్షన్‌ను యువకులకు అలవాటు చేశారు.
షేక్ ఫర్ధీన్ ల్యాబ్ టెక్నీషియన్‌గా మూడేండ్లుగా పనిచేస్తున్నాడు. మెడిసిన్‌పై అవగాహన ఉండడంతో యూట్యూబ్ ద్వారా మిడజోలం ఇంజక్షన్‌ను ఎలా తీసుకోవాలో తన స్నేహితులకు తెలుపగా వారు ఈ వ్యాపారానికి ఒప్పుకున్నారు. ఈ క్రమంలో మహ్మద్ పర్వేజ్ కస్టమర్ల దగ్గరికి వెళ్లి కస్టమర్లను తీసుకుని నిర్మల్‌లోని బైల్ బజార్‌కు తీసుకొచ్చారు. అక్కడ వారికి విక్రయిస్తున్న సమయంలో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 26 ఇంజక్షన్లను 10 సిరంజన్లను, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాలకు సంబంధించి 8712659599 నంబర్‌కు సమాచారం అందించాలని అన్నారు. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ రాజేశ్ మీనా, ఉపేందర్‌రెడ్డి, సీఐ ప్రవీణ్ ఉన్నారు.